ఆ బాలిక కడుపులో 3 కిలోల వెంట్రుకలు.. షాకైన పేరెంట్స్

చాలా మంది పిల్లలు ఆహారం తినకుండా, ఇతర వస్తువులను తినేస్తుంటారు. అందులో ప్రధానంగా మెటల్స్, వెంట్రుకల వంటి వాటిని తింటుంటారు. అయితే ఓ 15 ఏండ్ల బాలిక గత మూడేండ్ల నుంచి దాదాపు 3 కిలోల వెంట్రుకలను తినేసింది. వివరాల్లోకి వెళ్తే.. మెలిస్సా విలియమ్స్(15) అనే బాలిక తనకు 13 ఏండ్ల వయసు ఉన్నప్పుడు వెంట్రుకలను తినడం ప్రారంభించింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. అయితే తనకున్న పొడవాటి జుట్టు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వెంట్రుకలు తింటున్నావా..? అంటూ ఆమెను టీచర్లు, తోటి విద్యార్థులు మందలించారు. పూర్తిగా ఆమె సన్నబడి పోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక స్కూల్‌కు వెళ్లడం మానేసింది.
ఇంట్లో తన బెడ్రూంలో కూడా వెంట్రుకల కుప్పలు కనిపించాయి. దీంతో పేరెంట్స్ ఆరా తీయగా వెంట్రుకలు తింటున్నట్లు తేలింది. ఆహారం తీసుకున్నప్పుడు కూడా గొంతు నొప్పిగా ఉందని మెలిస్సా చెప్పేది. ఒక రోజు ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, కడుపులో వెంట్రుకలు ఉన్నట్లు తేలింది. దీంతో మెలిస్సాకు శస్త్ర చికిత్స నిర్వహించి, 3 కిలోల వెంట్రుకలను బయటకు తీశారు. రగ్బీ బాల్ మాదిరిగా వెంట్రుకలు తయారయ్యాయని, వాటిని నాలుగు భాగాలుగా కత్తిరించి బయటకు తీయాల్సి వచ్చిందని ఆమె తల్లి తెలిపింది. తన బిడ్డను ప్రాణాలతో కాపాడిన వైద్యులకు మెలిస్సా తల్లి కృతజ్ఞతలు చెప్పింది.