Hydra : ఆక్రమణలపై చట్టం అందరికి ఒకటే : హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆక్రమణలపై చట్టం అందరికి ఒకటే : హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రాతో సమాజానికి మేలు
ఇప్పటిదాక 500ఎకరాలు కబ్జా భూములు వెనక్కి
పీపీటీ పద్ధతిలో చెరువుల పునరుద్దరణ
దర్యాప్తు దశలో మల్లారెడ్డి, పల్లా, ఓవైసీల ఆక్రమణలు
ఫామ్ హౌస్ ల నిర్మాణాలపై విచారణ చేసి నోటీస్ లు
విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల ఆక్రమణలపై హైడ్రా(Hydra) తీసుకునే చర్యల విషయంలో చట్టం అందరికి ఒకటేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) స్పష్టం చేశారు. చట్టాలు సామాన్యులకు.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీకి వేరుగా ఉండవని..టైమ్ రాగానే చట్టం అందరికి ఒక్కటే అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీల ఆక్రమణలపై వివరాలు సేకరిస్తున్నామని..విచారణ చేసి నోటీస్ లు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం బషీర్ బాగ్(Basheer Bagh) ప్రెస్ క్లబ్ లో రంగనాథ్(Ranganath) మీడియా సమావేశంలో మాట్లాడారు. హైడ్రా రాజకీయాలకు అతీతంగా నడుస్తోందని..రాజకీయ కక్షతో నోటీసులు ఇవ్వడం కుదరదని రంగనాథ్ స్పష్టం చేశారు. ముందస్తు చర్యలు లేకుండా నిర్మాణాలు కూల్చితే కోర్టులో ఇబ్బంది అవుతుందన్నారు. ఎవరో విమర్శ చేశారని…రాజకీయ కక్ష హైడ్రా ద్వారా ఉండబోదని స్పష్టం చేశారు. ఫాతిమా కాలేజీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కంటే …అంబేద్కర్ కాలనీ ముఖ్యం అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చెరువుల్లో రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ లు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయని..చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫామ్ హౌస్ లకు, అక్రమ కట్టడాలకు నోటీసులు ఇస్తాం అని తెలిపారు.
ఫైనల్ నోటిఫికేషన్ లో 130 చెరువులు
హైడ్రా తో ఏం చెయ్యాలో మాకు పూర్తిగా క్లారిటీ లేదని..ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తోందని రంగనాథ్ తెలిపారు.హైడ్రాతో ఇప్పటి వరకు కబ్జాకు గురైన భూమిలో 500 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని..అనేక కాలనీలలో ఆక్రమణలను తొలగించి రోడ్ల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనులు పీపీటీ పద్ధతిలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, 130 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ అయ్యాయని..కానీ అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణలో భాగంగా అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట.. కూకట్ పల్లి నల్లచెరువు దాదాపు సిద్ధమవ్వగా.. మరి కొన్ని రోజుల్లో మిగతా 4 చెరువులు (బమృక్ను ద్దౌలా చెరువు, ఉప్పల్ నల్లచెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువు) కూడా సిద్ధమవుతాయని..తర్వాత మరో 13 చెరువుల అభివృద్ధిని చేపడతామని తెలిపారు. హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయాలంటే భారీ బడ్జెట్ కావాలని, ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ కబ్జా ఆగిపోయిందన్నారు. జీహెచ్ఎంసీ 435యాక్ట్ ప్రకారం అక్రమ నిర్మాణం అయితే నోటీసులు లేకున్నా కూల్చవచ్చు అని వెల్లడించారు. కొన్ని లీగల్ సమస్యల వల్ల హైడ్రా పోలీస్ స్టేషన్ వర్క్ కావడం లేదన్నారు. వచ్చే నెల రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ వర్క్ స్టార్ట్ కాబోతోందని తెలిపారు.
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ ఆపరేషన్స్ తో వరదల నియంత్రణ
వర్షకాలంలో వరదల సమస్య నియంత్రణకు హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లతో జులై 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 15665 క్యాచ్‌పిట్లను క్లీన్ చేసిందని తెలిపారు. 359 కల్వర్టులలో పూడిక తొలగించామని..1670 చోట్ల నాలాల్లో చెత్తను బయటకు తీసి తరలించామని వెల్లడించారు. 4609 వాటర్ లాగింగ్ పాయింట్లను హైడ్రా(Hydra) క్లియర్ చేసిందని.. వర్షాల వేళ 4974 ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్తను తొలగించిందని తెలిపారు. ఇలా మొత్తం 27,272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులను, 810 చోట్ల నేలకొరిగిన చెట్ల తొలగింపు పనులను జులై ఆరంభం నుంచి ఆగస్టు 21వ తేదీ వరకూ హైడ్రా నిర్వహించిందన్నారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమాలను నిర్వహించి వరద కాలువలు, నాలాల పరిరక్షణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తోందని..నాలాల్లో చెత్త వేయకుండా పర్యవేక్షించాలని వారిలో చైతన్యం నింపుతోందని తెలిపారు.