Kishan Reddy | ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ మోసం: కిషన్రెడ్డి
ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గతంలో బీఆరెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై రైతులను మోసం చేసి గోస పెట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు

రుణమాఫీ లేదు..బోనస్ లేదు
కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
విధాత: ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గతంలో బీఆరెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై రైతులను మోసం చేసి గోస పెట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని రాఘవపూర్, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు.
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడుతున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం హామీలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని చెబుతున్నారన్నారు. దొడ్డు ధాన్యం పండించే రైతులకు అన్యాయం చేస్తే సహించలేది లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాతలకు రుణమాఫీ లేదు.. బోనస్ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. దేవుడి మీద ఒట్టు పెడితే వ్యవసాయదారులకు న్యాయం జరగదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉందనన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేసేందుకు, రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, కాని ఆ పార్టీ నేతలు ఢిల్లీకి సూట్ కేసులు మోసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గద్దె దిగాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.