శ‌నివారం మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కేఎల్ రాహుల్.. కెప్టెన్సీ నుండి త‌ప్పించ‌డం వెన‌క కార‌ణం?

శ‌నివారం మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కేఎల్ రాహుల్.. కెప్టెన్సీ నుండి త‌ప్పించ‌డం వెన‌క కార‌ణం?

ఐపీఎల్ సీజ‌న్ 17లో అనేక మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయి. ఫ్రాంచైజీలు క‌ప్ కొట్టాల‌నే క‌సితో ఊహించ‌ని మార్పులు చేస్తుంది. కెప్టెన్సీలోను సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఇప్ప‌టికే ముంబైకి రోహిత్‌ని త‌ప్పించి హార్ధిక్ పాండ్యాకి ప‌గ్గాలు అప్ప‌గించారు.ఇక తాజాగా ల‌క్నో విష‌యానికి వ‌స్తే కేఎల్ రాహుల్‌ని కెప్టెన్సీ నుండి త‌ప్పించి నికోల‌స్ పూర‌న్‌ని కెప్టెన్ చేశారు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. లక్నో ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణ‌యం తాత్కాలిక‌మా లేకుంటే సీజన్ మొత్తానికా అనే విషయంపై స్పష్టత లేదు. సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్‌పై కాస్త‌ పనిభారం తగ్గించాలని ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు పూర‌న్ తెలియ‌జేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. 21 ఏళ్ల LSG ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులు విసిరి మంచి విజ‌యాన్ని అందించాడు. తొలుత ల‌క్నో బ్యాటింగ్ చేయ‌గా, నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 199 పరుగులు చేసింది. డికాక్ (54; 38 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడారు. దీంతో భారీ స్కోరు సాధించింది ల‌క్నో జ‌ట్టు. ఇక ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా బ‌రిలోకి దిగిన‌ పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

ఓపెనర్లు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (70), బెయిర్‌స్టో (42) ధాటిగా ఆడి మొదటి వికెట్ కు 102 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. వీరిద్ద‌రు ఆది నుండే ల‌క్నో బౌల‌ర్స్‌పై ఎదురు దాడి చేసి భారీగా పరుగులు రాబ‌ట్టారు. ధావ‌న్ అయితే 29 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కం పూర్తి చేశాడు.అయితే అరంగేట్ర బౌల‌ర్ అయిన మ‌యాంక్ యాద‌వ్ ముందుగా బెయిర్‌స్టోని పెవీలియన్‌కి పంపాడు. ఆ త‌ర్వ‌త ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (19; 7 బంతుల్లో), కాసేపటికీ జితేశ్ శర్మ (6; 9 బంతుల్లో)ను కూడా పెవిలియన్‌కు చేర్చి లక్నోను తిరిగి పోటీలోకి వ‌చ్చేలా చేశాడు. మయాంక్ సగటున గంటకు 150 కి.మీ వేగంతో బంతులు సంధించ‌డంతో పంజాబ్ బ్యాట‌ర్స్ బెంబెలెత్తిపోయారు. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన ప్లేయ‌ర్‌గా మ‌యాంక్ రికార్డు (155 కి.మీ/గ) సాధించాడు. ఇక మోహిన్స్ ఖాన్ కూడా అద్భుత‌మైన బౌలింగ్ వేయ‌డంతో ల‌క్నోకి మంచి విజ‌యం ద‌క్కింది.