Amity University assault | దారుణం : తోటి విద్యార్థిని 45 నిమిషాలపాటు చెంపలు వాయించిన క్లాస్​మేట్స్​

లక్నోలోని అమిటీ యూనివర్సిటీ ప్రాంగణంలో రెండవ సంవత్సరం లా విద్యార్థి శిఖర్ కేసర్వానీని సహ విద్యార్థులు 50–60 సార్లు చెంపదెబ్బలు కొట్టిన సంఘటన కలకలం రేపింది. వీడియో వైరల్ అవుతోంది.

Amity University assault | దారుణం : తోటి విద్యార్థిని 45 నిమిషాలపాటు చెంపలు వాయించిన క్లాస్​మేట్స్​

Amity University assault | లక్నోలోని అమిటీ యూనివర్సిటీలో చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండవ సంవత్సరం లా విద్యార్థి శిఖర్ కేసర్వానీని క్లాస్​మేట్లు 45 నిమిషాల పాటు కారు లోపల బంధించి 50–60 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన బయటపడింది. ఈ సంఘటన ఆగస్టు 26న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఘటన వివరాలు

బాధితుడు శిఖర్ తన స్నేహితురాలు సౌమ్య సింగ్ యాదవ్‌తో యూనివర్సిటీకి చేరుకున్నాడు. యూనివర్సిటీ పార్కింగ్ లాట్‌లోకి రాగానే, కొందరు విద్యార్థులు “మాట్లాడాలి” అంటూ ఆయనను సౌమ్య కారులోకి వెళ్లి గట్టిగా పట్టుకున్నారు.

  • శిఖర్ తండ్రి ముఖేష్ కేసర్వానీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, విద్యార్థులు ఆయన కుమారుడిని దూషిస్తూ, ప్రాణహాని బెదిరింపులు చేశారు.
  • ఆగస్టు 11న శిఖర్ కాలి లిగమెంట్ శస్త్రచికిత్స చేయించుకొని చేతికర్ర ఆధారంగా నడుస్తున్నప్పటికీ, దారుణంగా దాడి చేశారు.
  • జాహ్నవి మిశ్రా, అయుష్ యాదవ్‌లు శిఖర్‌ను 50–60 సార్లు చెంపదెబ్బలు కొట్టి, కుటుంబాన్ని అవమానించేలా తిట్టారని ఆయన ఆరోపించారు.
  • మిలే బెనర్జీ, వివేక్ సింగ్ ఈ దాడి వీడియో తీయగా, క్యాంపస్‌లో షేర్ చేసినట్లు తెలిపారు.

వీడియోలో ఏముంది?

101 సెకన్ల నిడివి గల వీడియోలో –

  • ముందరి సీట్లో కూర్చున్న జాహ్నవి మిశ్రా పదేపదే శిఖర్ చెంపపై కొడుతూ, “హాత్ నీచే (చెయ్యి కిందకు దించు)” అంటూ బెదిరిస్తోంది.
  • పక్కన కూర్చున్న అయుష్ యాదవ్ అతన్ని తోసిపడేసి మరీ కొడుతూ, “అగర్ మైన్ మార్నా శురు కరుంగా… హాత్ నీచే కర్ ( నేను కొట్టడం ప్రారంభిస్తేనా..చేయి దించు)” అంటూ బెదిరిస్తున్నాడు.
  • వీడియోలో “క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? జాహ్నవి గురించి మాట్లాడతావా? సౌమ్య గురించి మాట్లాడతావా?” అంటూ దాడి చేస్తూ కనిపించాడు.
  • మరికొందరు “అతను క్షమాపణ చెప్పాడు, ఇక ఆపు” అని చెప్పినా, దాడి కొనసాగింది. వీడియో చూడండి:


దాడి ప్రభావం

ఈ దాడి కారణంగా శిఖర్ తీవ్ర మానసిక షాక్‌కు గురయ్యాడు. తరగతులకు హాజరుకాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాడని తండ్రి తెలిపాడు.
ఫిర్యాదు ఆధారంగా అయుష్ యాదవ్, జాహ్నవి మిశ్రా, మిలే బెనర్జీ, వివేక్ సింగ్, ఆర్యమన్ శుక్లాలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

యూనివర్సిటీ ప్రాంగణంలోనే విద్యార్థులపై ఇంత దారుణం జరిగిందన్న వార్త సమాజాన్ని కుదిపేసింది. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.