రైతుల సమస్యలపై కదం తొక్కిన దక్షిణ కోస్తా, సీమ జిల్లాల రైతులు
విధాత: తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం గురువారం నాడు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగాయి. పార్టీ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక చర్యలను ఎండగట్టారు. నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బి.సి జనార్థన్ రెడ్ది పర్యవేక్షణలో జోన్-4 పరిధిలో ఉన్న దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో […]

విధాత: తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం గురువారం నాడు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగాయి. పార్టీ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక చర్యలను ఎండగట్టారు. నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. బి.సి జనార్థన్ రెడ్ది పర్యవేక్షణలో జోన్-4 పరిధిలో ఉన్న దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరగగా భారీగా టీడీపీ నేతలు, శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ..
ఎంతో కష్టపడి అన్నదాత పండించిన పంటలకు మద్ధతు ధర లేక పంటను రోడ్ల పక్కన పడేసే దుస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పచ్చిమిర్చి, సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో టమోటాకు మద్ధతు ధర దక్కకపోవడంతో రైతులు రోడ్లపైనే తమ పంట ఉత్పత్తులను పారబోయడం చూశాం. చిత్తూరు జిల్లాలో కనీసం రవాణా ఛార్జీలకు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ టమోట రైతులు వాపోతున్నారు. పంట అమ్మి లాభాల మూటతో ఇంటికి వెళ్లాల్సిన రైతులు… మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బస్సు చార్జీలు కూడా లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. 50 కిలోల బస్తా ఉల్లిపాయ ధర రూ.1000 నుండి రూ.1500 పలకాల్సి ఉండగా… రూ.100 నుంచి రూ.300కి పడిపోయింది. ఉల్లి రైతులకు కనీసం కూలీ ఖర్చులకు కూడా గిట్టుబాటు కావడం లేదు. పసుపు రైతులది కూడా అదే పరిస్థితి. రాయలసీమలో పసుపు విక్రయ మార్కెట్ కడపలో మాత్రమే ఉంది. దీంతో అక్కడకు రోజుకు 1500 నుంచి 2000 బస్తాల సరుకు మార్కెట్కు వస్తోంది. ఇక్కడ కూడా అదే దోపిడీ జరుగుతోంది. తుఫానులు, వరదలతో దక్షిణ కోస్తా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఇన్ ఫుట్ సబ్సిడీ సాయం కూడా ఇవ్వడం లేదు. వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో 90 శాతం మంది కౌలు రైతులే ఉన్నారంటే… జగన్ రెడ్డి ప్రభుత్వంలో కౌలు రైతులు ఎలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అర్థం అవుతుంది.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువమంది రైతులు సాగుచేసే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పొగాకు బోర్డు ఉన్నప్పటికీ… పొగాకు వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. సుబాబుల్ సాగు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒక పేపరు పరిశ్రమ స్థాపిస్తే రైతుకు మేలు జరుగుతుందన్న నారా చంద్రబాబునాయుడి గారి ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ దిశగా కృషి చేసింది. ఇండోనేషియాకు చెందిన ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కంపెనీ ‘ఆంధ్రా పేపర్ ఎక్సలెన్స్’ పేరుతో ఆసియాలోనే అతిపెద్ద కాగితపు పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. కాగితపు పరిశ్రమకు శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు. వైసీపీ వచ్చాక జిల్లా రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కంపెనీకి ప్రస్తుత ప్రభుత్వం భూకేటాయింపుల విషయంలో మోకాలడ్డడంతో అది కాస్తా పక్క రాష్టాలకు వెళ్లిపోయింది. వైసీపీ స్వార్థానికి సుబాబుల్ రైతులు బలయ్యారు.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక గత సీజన్లో అల్లాడిపోయారు. తెలుగుదేశం హయాంలో తొతాపురి రకం మామిడి టన్నుకు రూ.20వేలకు అమ్ముడుపోగా… వైసీపీ ప్రభుత్వంలో రూ.6 నుంచి రూ.8వేలకు పడిపోయింది బేనీషా, మల్లిక, ఇమాంపసంద్, నీలం రకాల పండ్ల ధరలు కూడా అలాగే ఘోరంగా పావు వంతు కన్నా తక్కువకు పడిపోయాయి. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్గా మారి మామిడి రైతుల శ్రమను దోచుకుంటున్నారు. దీనిపై గత జూన్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి బహిరంగ లేఖ కూడా రాశారు. అయినా మామిడి రైతులకు న్యాయం జరగలేదు.
జగన్ మొద్దు నిద్రతో వెలుగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, అక్రమ ప్రాజెక్టు అంటూ.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తే… తెలుగుదేశం నేతలు, ప్రకాశం జిల్లా రైతులు పోరాడేవరకు జగన్ రెడ్డి ప్రభుత్వానికి సోయి లేదు. ఎన్టీఆర్ దార్శనిక ప్రాజెక్టు తెలుగుగంగ కూడా కష్టాల పాలయ్యేది. సోమశిల ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయినా పనుల ప్రారంభోత్సవాలు అంటూ ప్రచార కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలింత వరకు ముంపు ప్రాంతాలలో భూముల సేకరణే చేయలేదు. దీంతో సోమశిల వెనుక వరద జలాల ముంపుతో పంటలు మునిగిపోయాయి. వర్షాలు, వరదలకు ఇప్పటికే రెండుసార్లు పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించలేదు. గత తెలుగుదేశం హయాంలోనే చిత్తూరు జిల్లాకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువెళ్లారు చంద్రబాబు. మరో 20 శాతం పనులు పూర్తిచేస్తే చిత్తూరు జిల్లా రైతుల సాగునీటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ కాస్త కూడా చేయలేకపోతోంది ఈ వైసీపీ ప్రభుత్వం. కుప్పం రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించగా సమస్యను గుర్తించి, పరిష్కరించాల్సిన ప్రభుత్వం తెలుగుదేశం నాయకులను నిర్బంధించి కేసులు పెట్టింది. కృష్ణా జలాల్లో రాయలసీమకు ఇంతకాలం జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట పడాలంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయవలసి ఉంది. కానీ ఈ బోర్డును జగన్ రెడ్డి విశాఖపట్నానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.