ఏపీలో అంగన్ వాడీల సమ్మె విరమణ
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు 42 రోజులుగా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు

– యూనియన్ నేతలతో ప్రభుత్వం చర్చలు సఫలం
– విధులకు హాజరైన అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు
– టెర్మినేషన్ ఆర్డర్లతో సాంకేతిక సమస్య
విధాత, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు 42 రోజులుగా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. యూనియన్ నేతలతో ఆదివారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ చేపట్టిన చర్చలు కొలిక్కివచ్చాయి. పలు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా యూనియన్ నేతలు వెల్లడించారు. ఈక్రమంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులకు హాజరయ్యారు. ఇప్పటికే మూడు దఫాలుగా ప్రభుత్వం, అంగన్ వాడీల మధ్య చర్చలు కొనసాగినా ఉభయులూ అంగీకారానికి రాలేకపోయారు. దీంతో నాలుగో దఫా మంత్రి బొత్సతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల సందర్భంగా.. జూలైలో జీతాల పెంపునకు ఒప్పుకున్నారు. మొత్తం 11 డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.
జీవిత బీమా వర్తింపు, రూ.2 లక్షల ప్రమాద బీమా, మట్టి ఖర్చులు రూ.20 వేలు, అంగన్ వాడీ కేంద్రాల అద్దె బకాయిలు రూ.66.54 కోట్ల నిధుల విడుదల, 55,607 అంగన్ వాడీ కేంద్రాల్లో సామగ్రి కోసం రూ.7.81 కోట్ల నిధుల మంజూరు, అన్ని ప్రభుత్వ సంక్షమ పథకాల అమలు, 21206 అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నపాటి మరమ్మతులకు రూ.6.36 కోట్ల నిధుల విడుదల, అంగన్ వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితి పెంపు, నెలనెలా టీఏ, డీఏ క్లైయింలు, సమ్మె కాలానికి మొత్తం జీతం చెల్లింపు, విధుల నుండి తొలగింపు నిలుపుదల, సమ్మె కాలంలో కేసుల ఎత్తివేత, వయోపరిమితి, సర్వీసు ముగింపు ప్రయోజనాలు తదితర అంగన్ వాడీల ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెను విరమించి, విధుల్లో చేరారు. కాగా సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన అంగన్ వాడీలకు పాలనాపరమైన పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. జాయినింగ్ రిపోర్టు తీసుకుని టెర్మినేషన్ ఆర్డర్లు రద్దు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అంగన్ వాడీలు ససేమిరా అన్నారు. జాయినింగ్ రిపోర్టులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మరోవైపు రిపోర్టు ఇవ్వకపోతే అంగన్ వాడీ కేంద్రం తాళం ఇవ్వమంటూ ఆశాఖ అధికారులు పేర్కొనడంతో సాంకేతిక సమస్య ఎదురైంది.