Minister Vangalapudi Anitha | సెక్యూరిటీ లేకపోతే.. జనం తిరుగబడుతారని జగన్‌కు భయం: మంత్రి అనిత

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రతను ఎవరూ తొలగించలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ తన భద్రతపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు

Minister Vangalapudi Anitha | సెక్యూరిటీ లేకపోతే.. జనం తిరుగబడుతారని జగన్‌కు భయం: మంత్రి అనిత

విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రతను ఎవరూ తొలగించలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ తన భద్రతపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రూల్స్‌ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో 20వేల మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా అని మండిపడ్డారు. సోమవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం పరిశీలించారు. జైలు ఆధ్వర్యంలో పెట్రోలు బంక్‌ను ప్రారంభించిన అనంతరం.. సెంట్రల్‌ జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా స్నేహ బ్లాక్‌ వద్దకు వెళ్లాక హోం మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించడాన్ని ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. తమ నాయకుడు సీఎం చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజులు గుర్తుకువచ్చి బాధగా అనిపిస్తుందన్నారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారని పేర్కొన్నారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయని తెలిపారు. వాళ్ల పాపాలు పండాయని.. అందుకే జన నాయకుడిని బాధపెట్టిన వైసీపీని పాతాళానికి తొక్కేలా ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

రానున్న రోజుల్లో సెంట్రల్‌ జైలులో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని వంగలపూడి అనిత తెలిపారు. జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు సిబ్బంది తరహాలో తమకు కూడా ఈఎల్స్ కావాలని జైలు సిబ్బంది అడిగారని.. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సెంట్రల్‌ జైలులో డీఅడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వానికి విన్నవిస్తానని అన్నారు. అలాగే ఖైదీలకు క్షమాభిక్షను కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పారు.