అమరావతి : తెలుగు రాష్ట్రాలలో మహిళలకు అమలవుతున్న ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఆర్టీసీ సిబ్బందికి సమస్యాత్మకంగా తయారైంది. కిక్కిరిసిన బస్సులో ప్రయాణికులకు వద్ధకు వెళ్లి టికెట్లు జారీ చేయడంలో వారు పడుతున్న అసస్థలకు తోడు ప్రయాణికులలో వాగ్వివాదాల పాలవుతున్నారు. తాజాగా ఏపీలో అమలవుతున్న ఉచిత బస్సు పథకంపై ఓ మహిళా కండక్టర్ తన బాధను వెళ్లగక్కుతు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు నా మనవి అంటూ కుసుమ కుమారి పెట్టిన వీడియోలో ఉచిత బస్సు పెట్టి మా జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుతున్నారని ప్రశ్నించారు.
ఒక్కో బస్సులో 150మందికి పైగా ఎక్కుతున్నారని. కండక్టర్లతో దురుసుగా మాట్లాడుతున్నారని..డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కకుండా ఫుట్ బోర్డు ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఎందుకండి మా ఉద్యోగాలతో ఇలా ఆడుకుంటున్నారని..అధికారులెవరికి కూడా మా సేవల పట్ల జాలి దయా లేదా అని..రోడ్డు పైన టీస్టాల్ అతనికంటే మా ఉద్యోగం అద్వాన్నమైపోయిందని వాపోయింది. బస్సుల్లో జనాలు మా మాట వినడం లేదని..బస్సుల్లో ప్రయాణికులు కొట్టుకుంటున్నారని..రద్ధీతో మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగా ఉందని..మీరు ఇచ్చే జీతాల కంటే ఎక్కువే కష్టపడుతున్నామని ఆమె తన వీడియోలో ఆవేదన వెలిబుచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విధుల్లోకి వచ్చిన కుసుమ కుమార్ కి డ్యూటీ వేయకుండా శాఖపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది.