YS Sharmila | జగన్ ప్రతిపక్ష నేత హోదాకే కాదు.. ఎమ్మెల్యేగా పనికిరాడు: వైఎస్ షర్మిల

ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్‌ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని.. వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ట్విటర్ వేదికగానే ఘాటుగా స్పందించింది.

YS Sharmila | జగన్ ప్రతిపక్ష నేత హోదాకే కాదు.. ఎమ్మెల్యేగా పనికిరాడు: వైఎస్ షర్మిల

ట్విటర్‌లో వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు
మీ పోస్టు చంద్రబాబు నుంచా..పక్క రాష్ట్రంలోని ఏజెంటు నుంచి వచ్చిందా
షర్మిల విమర్శలపై వైసీపీ ఎదురుదాడి

విధాత, హైదరాబాద్ : ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్‌ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని.. వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ట్విటర్ వేదికగానే ఘాటుగా స్పందించింది. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టింది. మీ మాటలు చూస్తే జగన్‌ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప.. ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని షర్మిలపై వైసీపీ పార్టీ మండిపడింది. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే చంద్రబాబుకు మద్దతు పలకడమే మీ అజెండా అని అర్థమవుతుందని విమర్శించింది.

దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహాలు కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా అని ప్రశ్నించింది. పావురాల గుట్టలో పావురమైపోయాడని వైఎస్సార్‌ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా అని మండిపడింది. తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి.. అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా? అని షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. మీకన్నా పిరికివాళ్లు.. మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు.. మీకన్నా అహంకారులు.. మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా అని నిలదీసింది. ఇంతకీ మీరు పోస్టు చేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా? అని నిలదీసింది.

మోసం చేయడం జగన్‌కు కొత్తేమి కాదన్న షర్మిల

అంతకుముందు షర్మిల తన అన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విటర్ వేదికగా విరుచకపడింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్‌ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. సిగ్గు సిగ్గు.. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహకారం ఎక్కడ కనిపించవు, వినిపించవని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. మోసం చేయడం జగన్‌కు కొత్తేమీ కాదని వైఎస్‌ షర్మిల విమర్శించారు. మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని అన్నారు.

అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని జగన్‌పై షర్మిల మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదంటూ ఎద్దేవా చేశారు. జగన్‌ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని విమర్శించారు. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్పగా చేసి పెట్టారని.. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే.. తాపీగా ప్యాలెస్‌లో కూర్చుని మీడియా మీట్‌లు పెట్టడానికి మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేను చేయలేదని స్పష్టం చేశారు. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్‌రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు.

ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్‌ ఆఫ్‌ ది హౌస్‌లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదని అన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బడికి వెళ్లనని అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని.. ఆఫీసుకు వెళ్లనంటే పనిదొంగను వెంటనే పనిలో నుంచి పీకేస్తారని షర్మిల వివరించారు. అలాగే ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి వెళ్లనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని అన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు వెళ్తారో.. అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవడికి కావాలని పేర్కొన్నారు. అప్పుడు అసెంబ్లీకి వెళ్లని జగన్‌ అండ్‌ కో తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరఫున డిమాండ్‌ చేశారు.