NTR | న‌ట‌న‌కు విశ్వ‌విద్యాల‌యం ఎన్టీఆర్‌: బాల‌కృష్ణ‌

ఎన్‌టీఆర్ 101వ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు ఆర్పించారు

NTR | న‌ట‌న‌కు విశ్వ‌విద్యాల‌యం ఎన్టీఆర్‌: బాల‌కృష్ణ‌

ఎన్టీఆర్‌ 101వ జ‌యంతి సంద‌ర్భంగా బాల‌కృష్ణ నివాళులు
రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు అంటూ ప్ర‌శంస‌
ఎన్‌టీఆర్ ప‌థ‌కాల‌నే అంద‌రూ అవ‌లంబిస్తున్నార‌న్న‌ బాల‌కృష్ణ
ప్రముఖుల నివాళులు

విధాత, హైదరాబాద్: ఎన్‌టీఆర్ 101వ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు ఆర్పించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్‌టీఆర్ అని, ఆయ‌న స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నార‌ని తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్‌టీఆర్ మొద‌ట చ‌దువుకే ప్రాధాన్య‌త ఇచ్చారని, ఆ త‌ర్వాత చిత్ర‌రంగంలోకి వ‌చ్చార‌న్నారు. ఆయ‌న‌ అంటే న‌వ‌ర‌సాల‌కు అలంకారం అని అన్నారు. న‌ట‌న‌కు విశ్వ‌విద్యాల‌యం అని కొనియాడారు.

సినీ రంగంలో మ‌కుటంలేని మ‌హారాజుగా వెలుగొందుతున్న స‌మ‌యంలోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని తెలిపారు. రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు అని ప్ర‌శంసించారు. ఎన్‌టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక వైద్యులు, న్యాయ‌వాదులు, అభిమానుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టారన్నారు. తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వాన్ని చాటి చెప్పార‌న్నారు. ప్రభుత్వంలో సాహసోపేత నిర్ణయాలతో ఎన్నో పాలన సంస్కరణలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చారన్నారు. ఆయ‌న తీసుకొచ్చిన‌ ప‌థ‌కాల‌నే ఇప్పుడు అంద‌రూ అవ‌లంబిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ గుర్తు చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్: వెంకయ్యనాయుడు

తెలుగువారి గుండెచప్పుడు.. ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని, రాజకీయాల్లోనూ నవశకానికి నాంది పలికారని కొనియాడారు. ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని, నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని, గొప్ప సంస్కరణ వాది” అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఒక సంచలనం : పురంధేశ్వరి

ఎన్టీఆర్ అంటే ఒక పేరు, ఒక వ్యక్తి కాదు.. ఒక సంచలనమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి శ్లాఘించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. 320చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుని వెండితెర దైవంగా నిలిచారన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పధకాలు తెచ్చారని స్మరించారు.

తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్: చంద్రబాబునాయుడు

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు.

పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్ధం అని చెప్పి, ఆచరించి చూపారని, సంక్షేమంతో పాటే అభివృద్ధి, పాలనా సంస్కరణలకూ బాటలు వేశారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారన్నారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరం: జనసేన అధినేత పవన్

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మన ఎన్టీఆర్ ఒకరని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చని, అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలిఘటిస్తున్నాని పేర్కోన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, రూ.2కే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయాయని పవన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

తెలుగు జాతీ చిహ్నం ఎన్టీఆర్‌: సీఎం రేవంత్‌రెడ్డి

దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. ‘ఎన్టీఆర్.. తెలుగుజాతి చిహ్నం అని, ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ప్రముఖ చలనచిత్ర నటులు, నటరత్న, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి డా. నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని వారికి ఘననివాళులు అర్పిస్తున్నాను అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కూడా ట్విటర్ వేదికగా నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌కు జూనియర్..కల్యాణ్‌రామ్‌ల నివాళి

ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలతో హడావుడి చేశారు. అటు లక్ష్మీపార్వతి సైతం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్టీఆర్ ఘనతలను స్మరించారు.