జలధారతో ప్రతీ ఎకరానికి నీరు: సీఎం చంద్రబాబు
జలధారతో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నీటి భద్రత కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అనంతపురంలో ప్రకటించారు.
అమరావతి :- జలమే సంపద… దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ‘జలధార’తో రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడదామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా, యాడికిలో ‘జలధార..నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రూపొందించిన యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ….నీరు మనందరికీ సర్వస్వమని, నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నాం. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి..నిలబడిన నీటిని జలాశయంలో చేసేందుకు ప్రయత్నించాలని..గతంలో నీటీ నీటి సంరక్షణకు తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నాం అని, డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిపోగా.. హార్టికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం అని చంద్రబాబు తెలిపారు.
పూర్వోదయతో సీమ అభివృద్ధి
రాయలసీమ అభివృద్ధికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామని, కేంద్రం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకం ద్వారా రూ.30 వేల కోట్లు వస్తాయన్నారు. ‘పెట్టుబడులు ద్వారా మరో రూ.70 వేల కోట్ల రాబట్టి అభివృద్ధి చేస్తాం. గడిచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయి. చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం. జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భ జలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం. భూగర్భజలాలు పెరగటం మూలంగా హరిత ప్రాంతం పెరిగింది. ఇవన్నీ సానుకూలమైన అంశాలు’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. మొత్తంగా 1300 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంటుంది. ఈ ఏడాదిలో 74 టీఎంసీల నీరు అనంతపురం వరకూ తీసుకువచ్చాం. హంద్రీనీవా ద్వారా చిట్టచివరి భూములకు కూడా నీరు తీసుకెళ్లాం. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి రబీకి, ఖరీఫ్‌కు ఇచ్చే నీటిని ఆదా చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాం అని గుర్తు చేశారు. గత పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచారని, రూ.1.24 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని అన్నారు. కూటమి వచ్చాక గత ప్రభుత్వం పెంచిన సుమారుగా రూ.4,400 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. అలాగే తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
పిచ్చి ముదిరి మావిగన్ మాటలు
గత పాలకులు రాష్ట్ర ప్రజలకు అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. ‘గతంలో మూడు ముక్కలాట ఆడారు. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికారు. ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది. పిచ్చి ముదిరి మావిగన్ అంటూ కొత్తపేరు తీసుకొచ్చారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు మావిగన్ అంటున్నారు. బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. చూసి సహించలేక ఫ్రస్టేషన్‌తో అవినీతి జరిగిందని అంటున్నారు. 2047 నాటికి ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాం. దీనికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ గోదావరి వరకూ విశాఖ, ప్రకాశం- నెల్లూరు వరకూ అమరావతి, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి రీజియన్లుగా తయారవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.
పెట్టుబడులు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు
గత పాలకులు రాష్ట్రంపై పగపట్టారని, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతీ జిల్లాను అభివృద్ధి చేస్తున్నాం. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వనిదే. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదం నాణ్యతను దెబ్బతీశారు. కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేశారు. రాష్ట్రంపై విద్వేషం చూపించే వారికి సహకరిస్తే పౌరులందరికీ నష్టం కలుగుతుంది. పెట్టుబడులు తీసుకువస్తుంటే వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి వారిని దూరం పెట్టాలి. కరెంటు, నీరు లాంటి దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించుకుందాం. అందరికీ సమర్ధవంతమైన, జవాబుదారీ పాలన ఇవ్వాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రమే నా కుటుంబం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా చేయూత అందిస్తున్నాం. పెట్టుబడులు వస్తే.. ఆదాయం వస్తుంది అప్పుడే సంక్షేమం చేయగలం. సుపరిపాలనకు ప్రజలంతా సహకరించాలని’ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
మళ్లీ గడీల పాలన రానివ్వం : పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి
అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్‌ను తొలగిస్తారా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram