ఇప్పటికి 40 శాతం మంది ప్రజలు మనవైపే: మాజీ సీఎం వైఎస్ జగన్
ఏపీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగాల్సివుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా 40మంది ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని పార్టీ శ్రేణులు ఇది గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

ఫలితాలు శకుని పాచికలు
ఇది టీడీపీ జనసేన హానిమూన్ టైమ్
వేచి చూశాకే పోరాటాలు
త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన
ఎమ్మెల్సీల భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్
విధాత, హైదరాబాద్: ఏపీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగాల్సివుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా 40మంది ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని పార్టీ శ్రేణులు ఇది గుర్తు పెట్టుకోవాలని మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసుత్తం టీడీపీ, జనసేన హానీమూన్ నడుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని, ఆ తర్వాత ప్రజల తరుపున గట్టిగా పోరాటం చేద్దామని చెప్పారు. ప్రభుత్వ తీరు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకున్న తరువాతనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పేర్కొన్నారు.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, మనపై కేసులు పెట్టినా భయపడొద్దని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశముందని జగన్ అన్నారు. మళ్లీ వైసీపీ ఉవ్వెత్తున ఎగిసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కాగా జగన్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే ఆలోచనలో ఉన్నట్లుగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటమి అనంతరం నైరాశ్యంలో ఉన్న కేడర్‌లో ధైర్యం నింపేందుకు, టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.