విధాత : భారత్‌కు ఐఎండీ కరువు హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌నినో అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపింది. భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ధృవీకరించింది. సముద్ర ఉష్ణోగ్రతలు ఎల్‌నినోకు అవసరమైన పరిమితిని దాటినట్లు వెల్లడించింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ఎల్‌నినోగా పరిగణిస్తారు.

ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే భారత మాన్సూన్‌ను ప్రభావితం చేసే అంశం ఎల్‌నినో ఒక్కటే కాదని, ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తటస్థ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. అయినప్పటికీ రాబోయే నెలల్లో వర్షపాతం, వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

సాధారణంగా ఎల్ నినో పరిస్థితులు వస్తున్నాయంటే.. భారతీయ రైతులకు, వాతావరణ నిపుణులకు చేదు వార్తగా చెప్పవచ్చు. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షాలు తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్రమైన అనావృష్టి లేదా కరవు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉంటుంది. సముద్రం, వాతావరణం రెండూ కలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎల్ నినో వైపు అడుగులు వేశాయని వాతావరణ శాఖ విశ్లేషించింది. ఎల్ నినో తీవ్రతను కొలిచే కీలకమైన ‘నినో 3.4 ఇండెక్స్’ సగటు గడిచిన మూడు నెలల్లో +0.5 డిగ్రీల సెల్సియస్ దాటడంతో దీని రాక అధికారికంగా ఖరారైంది. మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటిపోయినట్లు ఐఎండీ పేర్కొంది.

మాన్సూన్‌ మిషన్‌ కపుల్డ్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌(ఎంఎంసీఎఫ్‌ఎఫ్‌) అంచనాల ప్రకారం.. రుతుపవన కాలం గడుస్తున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మధ్య ఉష్ణమండల పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిమితిని దాటాయి. నైరుతి రుతుపవనాల కాలంలో ఎక్కువ భాగం మితమైన, బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.

జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం హిందూ మహాసముద్రంలో ‘పాజిటివ్ ఐఓడీ’ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే నిజమైతే, పసిఫిక్‌లో ముంచుకొస్తున్న ఈ ‘సూపర్ ఎల్ నినో’ సృష్టించబోయే విధ్వంసాన్ని, నష్టాన్ని పాజిటివ్ ఐఓడీ కొంతవరకు అడ్డుకుని, భారతదేశానికి రక్షణ కవచంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూలైలో సానుకూల ఐఓడీ ఏర్పడే అవకాశం ఉందని, ఇది దేశంలోని రుతుపవన వర్షపాతంపై ‘సూపర్‌ ఎల్‌నినో’చూపే ప్రతికూల ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చని పేర్కొంది. రాబోయే కాలంలో పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో మారబోయే ఈ వాతావరణ పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తూ, ప్రతి నెలా అప్‌డేట్స్ ఇస్తామని భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు, రైతులకు భరోసా ఇస్తుంది.