చంద్రబాబుకు మద్దతుగా కాంతితో క్రాంతి

- కొవ్వోత్తులు వెలిగించి నిరసన
- పాల్గొన్న భువనేశ్వరీ, లోకేశ్‌లు
విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు శనివారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లో కాంతితో క్రాంతి పేరుతో విద్యుత్తు లైట్లు ఆర్పేసి, కొవ్వోత్తులు వెలిగించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇటీవల మోత మోగిద్దాం పేరుతో నిరసన చేపట్టిన టీడీపీ అదే క్రమంలో కాంతితో క్రాంతితో వినూత్న నిరసన నిర్వహించింది.

చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు, కార్యకర్తలు విద్యుత్తు లైట్లు ఆపి ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లో కొవ్వోత్తులు, దీపాలు, టార్చ్‌లైట్లు , మొబైల్ ఫోన్ల టార్చ్‌లు వెలిగించి నిరసన ప్రదర్శనలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నిరసన వీడియోలను బాబుతో నేను పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయాలని సూచించారు.
కాగా.. ఆయన పిలుపు మేరకు శనివారం రాత్రి 7గంటల నుంచి 7.05వరకు టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు లైట్లు ఆర్పి దీపాలు వెలిగించి నిరసనలు చేపట్టారు. రహదారులపై వాహనాల లైట్లు ఆపి నిరసన తెలిపారు. రాజమండ్రిలో నిర్వహంచిన కాంతితో క్రాంతి నిరసనలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ, ఢిల్లీలో లోకేశ్‌లు దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏపీ అధ్యక్షుడు అచ్నెన్నాయుడు కొవ్వోత్తులు వెలిగించి నిరసన చేపట్టారు.