Kumki Elephants | ఆంధ్రాకు.. ఆరు సుశిక్షిత కర్ణాటక ఏనుగులు! ఎందుకంటే?

కర్ణాటకలో 6,395 వైల్డ్‌ ఎలిఫెంట్స్‌ ఉన్నాయని అంచనా. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇన్ని ఏనుగులు లేవు. అయితే.. 2021/22 మధ్యకాలంలో కర్ణాటకలో 294 ఏనుగులు చనిపోయాయి. వీటిలో 51 ఏనుగులు విద్యుత్‌ షాక్‌, రోడ్డు లేదా రైలు ప్రమాదాల వంటి అసాధారణ కారణాలతో మృత్యువాత పడ్డాయి.

Kumki Elephants | ఆంధ్రాకు.. ఆరు సుశిక్షిత కర్ణాటక ఏనుగులు! ఎందుకంటే?

Kumki Elephants | ముల్లును ముల్లుతోనే తీయాలంటారు! ఇదే క్రమంలో ఎనుగుల బెడదను అదే ఏనుగులతో తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు చేసిన విజ్ఞప్తితో ఆరు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు కర్ణాటక సంసిద్ధతను వ్యక్తం చేసింది. సదరు కుమ్కీ (శిక్షణ పొందిన) ఎనుగులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఏపీలో తరచూ ఏనుగుల మందలు పొలాల మీదపడి విధ్వసం సృష్టిస్తున్నాయి. వాటి దాడుల్లో ప్రజలు సైతం చనిపోతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఏనుగులను చెదరగొట్టేందుకు, అదే సమయంలో ఏనుగులను పట్టుకునేందుకు సుశిక్షిత ఏనుగులను ఉపయోగించనున్నది.  మే 21వ తేదీన కర్ణాటక విధాన సౌధ మెట్ల వద్ద నిర్వహించే కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఈ ఏనుగులను అందించనున్నారు.

ఈ గజరాజుల్లో నాలిగింటిని డుబరే, రెండింటిని సక్రేబయిలు నుంచి ఎంపిక చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఆరు గజాలను అందించనున్నారు. మానవ ఆవాసాల మీదకు వచ్చే అటవీ ఏనుగులను తరిమికొట్టడంలో కుమ్కీ ఏనుగులను శిక్షణ పొందాయి. చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల వేట సాగుతున్నది. దీన్ని నివారించేందుకు, ఏనుగులను పట్టుకునేందుకు కూడా ఈ ఆపరేషన్‌ ఉపయోగపడనున్నదని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖాంద్రే చెప్పారు. ఈ చర్య తమ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. కర్ణాటకలో దసరా సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు అనువైన వాటిని మాత్రం ఇక్కడే ఉంచుతామని ఆయన తెలిపారు.

అయితే.. ఇలా ఏనుగుల తరలింపును వైల్డ్‌లైఫ్‌ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి చర్యలతో వాటి రక్షణ ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు. ఏనుగుల కేంద్రాలను, కారిడార్లను రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా అవి మానవ ఆవాసాలవైపు, రైతుల పొలాలవైపు వెళుతున్నాయని అంటున్నారు. కర్ణాటకలో 6,395 వైల్డ్‌ ఎలిఫెంట్స్‌ ఉన్నాయని అంచనా. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇన్ని ఏనుగులు లేవు. అయితే.. 2021/22 మధ్యకాలంలో కర్ణాటకలో 294 ఏనుగులు చనిపోయాయి. వీటిలో 51 ఏనుగులు విద్యుత్‌ షాక్‌, రోడ్డు లేదా రైలు ప్రమాదాల వంటి అసాధారణ కారణాలతో మృత్యువాత పడ్డాయి. గడిచిన పదేళ్లలో కర్ణాటకలో ఆవాసాల మీదకు, పొలాల మీదకు ఏనుగులు వెళ్లి విధ్వసం సృష్టించిన ఘటనలు 2,500 వరకూ చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 350 మంది చనిపోయారు. ఏనుగుల దాడిలో చనిపోయినవారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కర్ణాటక ప్రభుత్వం 20 లక్షలకు పెంచింది.