ప్రొద్దుటూరులో విద్వేష రాజకీయాలను సాగనివ్వం
విధాత:బిజెపి మహానాయకులంతా రాయలసీమలోని ఒక చిన్న పట్టణం ప్రొద్దుటూరుకు విచ్చేశారు.విభజన చటంలో హామీ ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ఇక్కడ చాలా రోజుల పాటు ఒక ఉద్యమం జరిగింది.వాళ్ళు వచ్చింది దాని గురించి మాట్లాడటానికి కాదు.రాయలసీమకు కచ్చితమైన నీటిహామీ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎండిన గొంతులతో మొరపెట్టుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నీటి తగాదా మధ్య అన్యాయమవుతున్న రాయలసీమ గురించి మాట్లాడటానికి వాళ్ళు రాలేదు.జగన్ ప్రభుత్వ అక్రమాల గురించి […]

విధాత:బిజెపి మహానాయకులంతా రాయలసీమలోని ఒక చిన్న పట్టణం ప్రొద్దుటూరుకు విచ్చేశారు.విభజన చటంలో హామీ ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ఇక్కడ చాలా రోజుల పాటు ఒక ఉద్యమం జరిగింది.వాళ్ళు వచ్చింది దాని గురించి మాట్లాడటానికి కాదు.రాయలసీమకు కచ్చితమైన నీటిహామీ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎండిన గొంతులతో మొరపెట్టుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నీటి తగాదా మధ్య అన్యాయమవుతున్న రాయలసీమ గురించి మాట్లాడటానికి వాళ్ళు రాలేదు.
జగన్ ప్రభుత్వ అక్రమాల గురించి మాట్లాడడానికీ వాళ్ళు రాలేదు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో తుమ్మల పల్లె యురేనియం మైనింగ్ ప్లాంట్ వల్ల నాశనమవుతున్న పల్లెల గురించి అసలు వాళ్ళు ఏరోజూ మాట్లాడిన పాపాన పోలేదు.ఈ మారుమూల పట్టణంలో ముస్లింలు ఎక్కువగా ఉండే జిన్నా రోడ్డు దగ్గర టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకూడదని ఆందోళన చేయడానికి వాళ్లిప్పుడొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఊరంతా మోహరించి రోడ్లు బంద్ చేసి 144 సెక్షన్ అని చెప్పి జనాన్ని కదలనివ్వకుండా చేశారు. ఇంతా చేసినా చిన్న గుంపుగా ఉన్న బిజెపి నాయకులను, కార్యకర్తలను మునిసిపల్ ఆఫీసుకు రాకుండా అడ్డుకోలేకపోయారట!
ఇప్పుడు.. ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మంది అయినవాళ్లను పోగొట్టుకొని, ఉపాధి కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతిని చస్తూ బతుకుతుంటే ఈ మహానాయకులు హిందువుల మనోభావాలు కాపాడటానికి వచ్చారటపెట్రోల్, గ్యాస్ ధరలు ఘోరంగా పెంచి హిందువులను కాపాడుతున్నట్లే, ఎక్కడే గాని ఆక్సీజన కొరత లేకుండా చేసి, అందరికీ వాక్సిన్ సరఫరా చేసి కరోనా బారినుండి దేశప్రజల్ని కాపాడుతున్నట్లే ఈ మహోపకారం చేయడానికి వచ్చారట.స్థానిక బిజెపి నాయకులు ఆదినారాయణ రెడ్డికి గాని, రమేష్ నాయుడికి, మిగతా వాళ్ళకు గాని స్థానిక సమస్యల గురించి చీమ కుట్టినంత కూడా లేదు. ఈ విగ్రహం మూలంగా ఏదో ఘోరం జరగబోతున్నట్లు ఇప్పుడు వీళ్ళ హంగామా ఎబ్బెట్టుగా ఉంది.జనం ఏమనుకుంటారోనన్న ఇంగితం కూడా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మతోన్మాద రాజకీయాలు చేసి, హింసను రెచ్చగొట్టి శవాల దొంతర మీద అధికారం చేజిక్కించుకోగలమని బిజెపి అనుకుంటున్నది.
ఒక్క మందిరం కట్టడానికి యూపీ ఎంత మూల్యం చెల్లించుకుంటుందో,ఎంతగా ఆ రాష్ట్రం అధిగతి పాలైందో మాకు తెలుసు.
వందల ఏళ్ల నుండి అరమరికలు లేకుండా సోదరసోదరీ భావంతో హిందూ ముస్లింలు ఇక్కడ జీవిస్తున్నారు. బిజెపి ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక్కడ చెల్లవని కచ్చితంగా చెప్పగలుగుతాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు ఈసారి ఏమొచ్చిందో ఏమో, ఊరంతా విగ్రహాలు పెడుతున్నాడు. ఒక్కసారైనా వాటికి అనుమతులున్నాయా లేదా ప్రశ్నించని వాళ్ళు ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహానికి అనుమతి ఉందా అని అడుగుతున్నారు.ఈ మూల ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అడ్డుకుంటామని అంటున్నారు కదా. మరి ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో టిప్పు సుల్తాన్ విగ్రహాలను ఏం చేస్తారు? ‘టిప్పు సుల్తాన్ ఒక హీరో. బ్రిటీష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడి మరణించాడు’ అని మాట్లాడిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను రాజీనామా చేయమనాలి కదా!
రాజ్యాంగం మొదటి ప్రింటులో ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మ పక్కనే టిప్పు సుల్తాన్ బొమ్మ ఉంది. మరి రాజ్యాంగాన్ని తగాలబెట్టేస్తారా? ముస్లిం అయినందువల్ల టిప్పు సుల్తాన్ ను విలన్ గా చిత్రిస్తున్నారు బిజెపి వాళ్ళు. ఎవరికో ఇష్టం లేనంత మాత్రాన చరిత్ర మారదు. టిప్పు సుల్తాన్ పరాయి రాజ్యాలతో యుద్ధం చేసినప్పుడు ఎంతో మందిని చంపిన మాట నిజమే. నిధులు కొల్లగొట్టిన మాట నిజమే. కానీ అది హిందువుల మీద ఒక ముస్లిం రాజు చేసిన మారణకాండ కాదు. అశోకుడిలా, చంద్రగుప్తుడిలా, ఇంకా ఎంతో మంది రాజుల్లా టిప్పు కూడా ఒక రాజు, అంతే. ముఖ్యమైన విషయం ఏమిటంటే తన రాజ్యంలో ఆయన మతసామరస్యాన్ని పాటించాడు. శృంగేరి పీఠానికి భారీ డొనేషన్లు ఇచ్చాడు. ఆ పీఠాధిపతిని ఆయన ‘జగద్గురు’ అని కూడా సంబోధించాడు. ఆ ఉత్తరాలు ఇప్పుడు కూడా దొరుకుతాయి. ఎంతో సంపద ఉన్న ఆ పీఠాన్ని మరాటాలు దోచుకొని, బ్రాహ్మణులను చంపితే ఈయన దానిని కాపాడి పునరుద్ధరించాడు. సదరు ఆలయానికి సంబంధించిన స్వామిని కూడా ఈ ముస్లిం రాజే రక్షించాడు.బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించే క్రమంలో ఫ్రెంచివారితో స్నేహానికి గుర్తుగా ఒక చర్చిని కూడా నిర్మించాడు టిప్పు సుల్తాన్.
పాలనా రంగంలో, ఆర్థిక రంగంలో, మిలిటరీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. మైసూరు రాజాన్ని శక్తివంతంగా, బ్రిటీష్ వారికి కొరకరాని కొయ్యగా తయారు చేశాడు. రెండో ఆంగ్లో మైసూరు యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడు. మూడో, నాలుగో యుద్దాలలో ఓడిపోయి చివరికి బ్రిటీష్ వారితో పోరాడుతూనే చనిపోయాడు. అంత పెద్ద బ్రిటీష్ సామ్రాజ్యానికి ప్రాణం పోయినా లొంగని వీరుడిగా చరిత్ర ఆయనను గుర్తించింది.
ఈ చరిత్ర మొత్తానికి బిజెపి మసి పూయాలని చూస్తోంది. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది.అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు ఎంత గుండెలు తీసిన బంట్లో ఒక చిన్న ఉదాహరణ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి ఆక్సీజన్ కొరతతో ఒక్కరూ కూడా చనిపోలేదని చేసిన ప్రకటన. కళ్ల ముందు జరుగుతున్న, ప్రజలంతా అనుభవిస్తున్న భీభత్సం గురించే అంత బుకాయించేవాళ్ళు ఎప్పుడో 1751 – 1799 మధ్య జీవించిన ఒక ముస్లిం రాజు గురించి ఇంకెంత చెప్పగలరు.
కాబట్టి వీళ్ళ విద్వేష రాజకీయాలను గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎన్ని కష్టాలున్నా మనందరం ఒకరికొకరు ఓదార్పు అవుతున్నాం. కలసి మెలసి ఉంటున్నాం. దాన్ని విచ్ఛిన్నం చేసి నెత్తురు పారించాలని చేసే కుటిల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేద్దాం.
-ప్రజాసంఘాల జేఏసీ, ప్రొద్దుటూరు