రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ..!

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ..!

దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రద్దీ కొనసాగుతున్నది. దీపావళి సందర్భంగా మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో పలుమార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు పేర్కొంది. ఈ నెల నవంబర్ 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు నడుపనున్నట్లు తెలిపింది.


రైలు నంబర్‌ 06073 ఆయా తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. భువనేశ్వర్‌ – చెన్నై సెంట్రల్‌ మధ్య 14, 21, 28 తేదీల్లో నడుస్తాయని పేర్కొంది. రైలు నంబర్‌ 06074 ఆయా రోజుల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైకి చేరుతుంది.


ప్రత్యేక రైళ్లు ఏపీలోని గూడురు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్‌ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. అలాగే చెన్నై సెంట్రల్‌ – సంత్రగాచి మధ్య సైతం ప్రత్యేక రైల్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 06071 నంబరు గల చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి స్పెషల్ రైలు ఈ నెల 11, 18, 25 అందుబాటులో ఉంటుంది. చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మూడోరోజు తెల్లవారు జామున సంత్రగాచికి చేరుకుంటుంది.


రైలు నంబ‌ర్‌ 06072 నంబరు గల సంత్రగాచి – చెన్నై సెంట్రల్‌ సూపర్‌ ఫాస్ట్‌ స్పెషల్‌ ట్రైన్‌ 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉండనుండగా.. సంత్రగాచిలో తెల్లవారు జామున 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నైకి చేరుతుంది. ఆయా రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డులో ఆగుతాయి. ఒడిశాలో భువనేశ్వర్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.