వెంక‌టాయిపాలెం శిరోముండ‌నం కేసు పూర్వాప‌రాలివి

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ

వెంక‌టాయిపాలెం శిరోముండ‌నం కేసు పూర్వాప‌రాలివి

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నాడు. విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టులో 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడిన అనంతరం ఈరోజు (2024 ఏప్రిల్ 16న) ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18నెల‌ల జైలుశిక్ష‌తో పాటు రూ.2ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. తోట త్రిమూర్తులుతో పాటు ఈ కేసులో 9మంది నిందితులున్నారు.

1994 డిసెంబరు లో రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా పోటీ చెసి గెలిచాడు…ఈ ఎన్నికల రోజున త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ కి పాల్పడింది…
ఆ రోజు బీఎస్పీ తరపున పోలింగ్ ఏజెంట్లు గా ఉన్న దళిత యువకులు ఈ రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. నిలదీశారు. దాంతో మ‌న‌సులో కక్ష పెట్టుకున్న తోట త్రిమూర్తులు అతని అన్నదమ్ములు దళితుల మీద వేధింపులకు పాల్పడ్డారు…
వేధింపుల్లో భాగంగా గ్రామంలోని ద‌ళిత‌ యువకులు కోటి చిన రాజు, దడాల వెంకట రత్నం, చల్లపూడి పట్టాభి రామయ్య, పువ్వుల వెంకట రమణ, కనికెళ్ళ గణపతిలపై ఫెన్సింగ్ పాల్స్ (పొలం కంచెకోసం నాటిన రాతిక‌ప్పులు) విర‌గ్గొగొట్టారు అని ఆరోపించి, వారిలో ఇద్దరు యువకులను పోలీసుస్టేషన్లో పెట్టారు… వీరితో పాటు మరో ముగ్గురుపై తప్పుడు ఫిర్యాదుతో ఈవిటీజింగ్ కేసు పెట్టారు. పోలీసులు ఈ త‌ప్పుడు కేసులో ఇద్దరిని డిసెంబరు 21, 1996న జైలుకు పంపారు..
1996 డిసెంబ‌ర్ 29న తోట త్రిమూర్తులు ఇంటి వద్ద పంచాయితీ పెట్టి దళిత కులపెద్దలతో ”మీవాళ్ళు నేరం చేసారు కాబట్టి మా చట్టం ప్రకారం కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళు పీకేస్తాం. ఇదీ మా తీర్పు” అని త్రిమూర్తులు ప్రకటించారు…
దీనికీ భయపడిన దళిత పెద్దలు త్రిమూర్తులు కాళ్ళమీద పడి క్షమించమ‌ని, కనికరించ‌మ‌ని బ‌తిమాలుకున్నారు. దీంతో కోటి చిన రాజు, దడాల వేంకట రత్నంలని కర్రలతో కొట్టి 150 మంది గ్రామ‌స్తుల‌ సమక్షంలో మంగలి రాంబాబు చేత శిరో ముండనం చేసి కనుబొమలు సైతం గుండుకొట్టారు.

వార్తాప‌త్రిక‌ల‌తో వెలుగుచూసిన ఘోరం!

ఈ వార్త 1997 జ‌న‌వ‌రి 4న పత్రికల్లో వ‌చ్చింది. దీనిపై అప్ప‌టి ఎస్పీ ఆదిత్య తుషార్ త్రిపాఠి సుమోటోగా కేసు నమోదు చేసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. తోట త్రిమూర్తులతో పాటు 10మందిని 87 రోజులు జైల్లో పెట్టారు…
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులు 1994లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొందారు. 1999లో టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్ర‌జారాజ్యంపార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో సైతం టిడిపిలో గెలిచారు. 2019లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీద పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు.
ఇలా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారులను తనకు అనుకూలంగా మలుచుకుని 28 ఏళ్లు ఈ కేసులో శిక్ష‌నుంచి త‌ప్పించుకుంటూ వ‌స్తున్నారు.

కేసును మూసేయ‌డానికి ర‌క‌ర‌కాల కుయుక్తులు!

బాధితుల పక్షాన వాదించాల్సిన కొందరు పి.పి.లను, ప్రాసిక్యూషన్ సాక్షులను ర‌క‌ర‌కాలుగా లొంగ‌దీసుకుని కోర్టులో కాగితాలు మాయం చేసి, హైకోర్టులో రిట్లు వేసి స్టేలు తెచ్చి తీర్పుని తనకు అనుకూలంగా తెచ్చుకునేందుకు ఎన్నో అడ్డదారులు తొక్కారు…బాధితులు అసలు ఎస్సీలు కాదు క్రైస్తవులు, ఈ కేసు ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద‌కు రాదు అనే రీతిలో తప్పుడు ఫిర్యాదులతో కింది కోర్టు లను, హై కోర్టులను తప్పు దారి పట్టించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు.

ప‌ట్టు విడువ‌ని వెంక‌టాయిపాలెం ద‌ళిత ఐక్య‌వేదిక‌, విర‌సం!

ఈ దశలో స్థానికంగా మొదటి నుండి పోరాడుతున్న వెంకటాయిపాలెం దళిత ఐక్య వేదిక, విశాఖ కేంద్రంగా విర‌సం ఐక్య వేదిక అన్ని దశల్లో పోరాటాన్ని కొన‌సాగిస్తూ…ఈ కేసు వాదిస్తున్న పి.పి. కే.సత్యనారాయణమూర్తికి అవసరం అయిన సమాచారం, సహకారం అందిస్తూ, బాధితులకు అండగా నిలబడ్డాయి …. చివ‌ర‌కు హైకోర్టు తీర్పుతో ఈ కేసులో రెండు నెలల్లోగా ట్ర‌య‌ల్ పూర్తి చేసి నేడు తీర్పు వెల్లడించారు.

28ఏళ్ల నిరీక్ష‌ణ‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ తీర్పు!

తోట త్రిమూర్తులు ఎన్ని కుయుక్తులు పన్నినా, బెదిరింపులకు దిగినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, చివరకు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే మరో సెక్షన్ కింద ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు లక్షా 50 వేల జరిమానాను అట్రాసిటీ కోర్టు విధించింది. ఈ కేసులో మొత్తం 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. ఈ పది మందిలో ఒకరు మృతి చెందారు. తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోర్టులోనే ఉన్నారు.

ఎన్నిక‌ల్లో పోటీకీ అడ్డంకుల్లేవు మ‌రి!

ఎన్నికల్లో పోటీపై త్రిమూర్తులకు భారీ ఊరటే లభించింది. ఎందుకంటే.. రెండేళ్లలోపే శిక్ష పడటంతో పోటీకి అడ్డంకులు ఉండ‌వ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. వారి ఆనందం ఆవిర‌య్యేలా వెంట‌నే ఈ కేసులో తోట త్రిముర్తులలుతోపాటు నిందితులంద‌రికీ హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తాత్కాలిక బెయిల్ మంజూరు అయింది.