గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే శ్రీకాళహస్తి క్షేత్రం..! ఎందుకు మూసివేయరంటే..?

గ్రహణాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నది. గ్రహణ కాలంలో మనుషులే కాకుండా పశుపక్షులు సైతం కదలవని ఓ నమ్మకం. గ్రహణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాలను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది. గ్రహణం అనంతరం ఆలయాల్లో సంప్రోక్షణ, శుద్ధి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ తర్వాతనే భక్తులను దర్శనాలకు అనుమతించడం జరుగుతుంది.
అయితే, గ్రహణ సమయంలోనూ కొన్ని ఆలయాలు తెరిచే ఉండనున్నాయి. గ్రహణకాలంలో విశేష పూజ కార్యక్రమాలు ఈ ఆలయాల్లో కొనసాగుతాయి. అందులో ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ పూజలు, అభిషేకాలు విశేషంగా జరుపబడుతాయి. ఇవాళ పౌర్ణమి సందర్భంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత మొదలై.. దాదాపు గంటన్నర వరకు పాక్షిక చంద్రగ్రహణం కొనసాగనున్నది. ఈ గ్రహణం సందర్భంగా మిగతా ఆలయాలన్నీ మూతపడినా వాయులింగేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
గ్రహణకాలంలోనూ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. రాహు, కేతువులతో పాటు ముక్కంటికి క్షేత్రంలో గ్రహణకాలంలో అభిషేకాలు నిర్వహించనున్నారు. వాస్తవానికి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ మూసివేయడం ఆనవాయితీ. గ్రహణ విడిచిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతిస్తుంటారు.
అయితే, రాహు, కేతు క్షేత్రంగా ఉన్న శ్రీజ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో గ్రహణకాలలోనూ అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. క్షేత్రంలో వాయు లింగేశ్వరుడిని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుచుకుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భాలయంలో ఉన్న స్వామివారి లింగంపై శ్రీ (సాలీడు), కాళము (పాము), హస్తి (ఏనుగు)తో పాటు.. భక్తకన్నప్ప గుర్తులు ఉంటాయి. వాయులింగేశ్వరుడు సూర్య, చంద్రులు, అగ్నిభట్టారడితో పాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తుంటారు.
అందుకే ఈ క్షేత్రంలో రాహు, కేతువుల ప్రభావం ఉండదని పండితులు పేర్కొంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతుంటాయి. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి దోష నివారణ పూజలు చేయించుకుంటారు. గ్రహణ సమయంలో రాహు, కేతు, సర్ప దోషాల నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే.. విశేష ఫలితం ఉంటుందని నమ్మకం. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు.