ఏపీలో రాబోయేది టీడీపీ-జనసేన కూటమే..
ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేసే వ్యక్తి

- టీడీపీ అరకు కాఫీని పరిచయం చేస్తే..
- వైసీపీ గంజాయిని మోసుకొచ్చింది
- జీవో 3 రద్దుతో ఉద్యోగాలు కోల్పోయిన గిరిజనులు
- 16 గిరిజన పథకాలనూ మాయం చేసింది..
- గిరిజనులను ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం
- జగన్ దోచేది ఎక్కవ.. జనాలకు ఇచ్చేది తక్కవ
అరకు ‘రా..కదలిరా..’ బహిరంగ సభలో చంద్రబాబు
విధాత: ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేసే వ్యక్తి జగన్ అని… బటన్ నొక్కడం తప్ప గిరిజనులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. 16 గిరిజన పథకాలనూ రద్దు చేశాడని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ‘రా..కదలిరా..’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై దుమ్మెత్తిపోశారు. బహిరంగ సభకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ రెడ్డి ఒక్క మంచిపనైనా చేశాడా? అంటూ ప్రశ్నించారు. అడ్డగోలుగా ధరలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయమైన అరకులో.. ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన చెందారు. ‘అరకు కాఫీ’ పేరును నేనే పెట్టానంటూ చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అరకు నుంచి కాఫీని పరిచయం చేస్తే.. వైసీపీ గంజాయిని పరిచయం చేసిందంటూ ఎద్దేవా చేశారు.
– జీవో 3 రద్దు చేయడమే సామాజిక న్యాయమా?
‘గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించానని, ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 3 తీసుకువస్తే.. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది’ అని చంద్రబాబు అన్నారు. ఈ జీవోను వైసీపీ ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జీవో 3 రద్దు చేయడమే సామాజిక న్యాయమా? అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోను పునరుద్ధరిస్తామని చెప్పారు. జగన్ నొక్కే బటన్ ఒకటి.. బొక్కే బటన్ ఒకటి అంటూ జగన్ దోచేది ఎక్కవ.. జనాలకు ఇచ్చేది తక్కవ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రోడ్డు వేశారా? సకాలంలో వైద్యం అందక చిట్టెంపాడుకు చెందిన గర్భిణి చనిపోయిందన్నారు. మృతదేహాన్ని తీసుకుపోవాలంటే అంబులెన్స్ పంపలేని దుస్థితితో ప్రభుత్వం ఉందన్నారు. విధిలేని గిరిజనం మృతదేహాలను స్కూటర్ పైన, డోలీలో మోసుకుపోవాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. గిరిజన నైపుణ్య శిక్షణా కేంద్రాలు, గిరిపుత్రిక కళ్యాణ పథకం, గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పారు. గిరిజనులను ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం… టీడీపీ హయాంలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన 16 గిరిజన పథకాలనూ రద్దు చేసిందని చెప్పారు. గిరిజన పిల్లల చదువు కోసం టీడీపీ ‘ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం’ తీసుకువస్తే.. వైసీపీ దాన్నీ రద్దుచేసిందని, గిరిజన పిల్లలు చదువుకోవడం జగన్ కు ఇష్టం లేదన్నారు. గిరిజన స్కాలర్ షిప్ లనూ తొలగించిందన్నారు. గిరిజనుల సహజ సంపదను దోచుకునే వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
– చంద్రబాబు హెలికాఫ్టర్ ప్రయాణంలో కలకలం
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అరకులో నిర్వహించిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభకు హెలికాఫ్టర్ లో బయలుదేరారు. అయితే సాంకేతిక కారణాలతో చంద్రబాబు హెలికాఫ్టర్ ప్రయాణంలో గందరగోళం ఏర్పడింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ కు – ఏటీసీకి సమాచార లోపం ఏర్పడింది. దీంతో నిర్దేశించిన మార్గం కాకుండా మరో మార్గంలో హెలికాఫ్టర్ అరకుకు బయల్దేరి వెళ్లింది. హెలికాఫ్టర్ రాంగ్ రూట్ లో వెళ్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) హెచ్చరించింది. దీంతో హెలికాఫ్టర్ ను వెనక్కి పిలిపించారు. మళ్లీ ఏటీసీ అధికారులు సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు హెలికాఫ్టర్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ చేరుకున్నారు.