Tomatoes Price : వైరల్ అవుతున్న ఏపీ టమాటా ధరలు

టమాటా, ఉల్లి ధరలు కిలోకు 50 పైసల వరకు పడిపోయి రైతులు నష్టపోతుంటే, వ్యాపారులు మాత్రం కిలో టమాటా రూ.32కి అమ్ముతూ దోపిడీ చేస్తున్నారు.

Tomatoes Price : వైరల్ అవుతున్న ఏపీ టమాటా ధరలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టమాటా, ఉల్లి ధరలు కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి అన్న సామేతను గుర్తు చేస్తున్నాయి. టమాటా, ఉల్లి పండించిన రైతులకు కనీస పెట్టుబడులు కూడా దక్కకపోతుండగా..వ్యాపారులకు మాత్రం సిరులు కురిపిస్తున్నాయి. వినియోగదారులను బాధిస్తున్నాయి. ఈ మార్కెట్ మయాజాలానికి అద్దం పడుతూ టమాటా కొనుగోలు రశీదు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయవాడ ఏఎస్ రామారావు రోడ్ కూరగాయల విక్రయ బజార్ లో కిలో టమాటా 32రూపాయాలకు విక్రయించారు. ఇందుకు సంబంధించిన కొనుగోలు బిల్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన నెటిజన్లు..రైతులు కిలో టమాటాలను రూ. 2కు అమ్మలేకపోతున్నారని..అదే సమయంలో వ్యాపారులు మాత్రం దుకాణంలో కిలోకు రూ. 32కి అమ్ముతున్నారని..ఈ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతు కష్టం..దళారుల పాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి, టమాటా ధరలు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతున్నారు. పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర కిలోకు 50 పైసల నుండి రూ.1 వరకు పడిపోగా, ఉల్లి ధర కిలోకు 30 పైసలకు చేరింది. ఇతర మార్కెట్లలో కూడా టమాటా ధరలు రూ.2 గా కొనసాగుతుంది. దీంతో టమాటా, ఉల్లి రైతులు నష్టాలను భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రోడ్లపైన, కాలువల్లో టమాటాలు, ఉల్లిగడ్డలు పారబోసి నిరసనలు తెలుపున్నారు. అటు వినియోగదారులకు చౌకగా దక్కకుండా మద్య దళారీ వ్యాపారులు టమాటా, ఉల్లి ధరలను పెంచి మార్కెట్లలో విక్రయిస్తున్నారు. రైతు కష్టాన్ని దోచుకుంటున్న ఈ మార్కెట్ మయాజాలానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విఫలమవుతుండటంతో రైతులు, వినియోగదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.