అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ బయటకు… లాభించేదెవరికంటే!
టీడీపీ తెలంగాణలో పోటీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోదని అంటున్నారు.

విధాత ప్రత్యేకం:
తెలంగాణలో టీడీపీ లేదన్నవాళ్లకు తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఖమ్మం వేదిక నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొన్నినెలల కిందట అధికారపార్టీ నేతలకు సవాల్ విసిరారు. 2014లో 15 సీట్లు 2018లో 2 సీట్లు ఆ పార్టీ సాధించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ అంగీకరించకపోయినా.. ఇప్పటికీ ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం, జీహెచ్‌ఎంసీ పరిధిలో బలం ఉన్నది. ఈసారి 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని, తమ అధినేత ఆమోదం తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కానీ.. తాజాగా పోటీ దూరంగా ఉంటామనడం వెనుక కారణాలపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో బీఆరెస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలో కొన్ని సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వచ్చిన సర్వేలూ ఉన్నాయి. మెజారిటీ సర్వేల ప్రకారం బీఆరెస్ కంటే కాంగ్రెసే ముందంజలో ఉన్నది. అప్పటి నుంచే అధికారపార్టీలో ఆందోళన మొదలైందని రాజకీయవర్గాలు అంటున్నాయి. నిజానికి వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ, బీజేపీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తాయనీ, తద్వారా తమకు లాభం జరుగుతుందనీ ఆ పార్టీ భావించింది. అయితే వైఎస్‌ఆర్‌టీపీ ప్రభావం అంతగా ఉండదని సర్వేల్లో తేలింది. మరోవైపు టీడీపీ కూడా పోటీ దూరంగా ఉంటామని ప్రకటించడంపై బీఆరెస్‌కు నిరాశ కలిగించే అంశమేనని పరిశీలకులు అంటున్నారు.
ఎగిసి.. పడిపోయిన బీజేపీ
2018లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితి కలిసి పోటీ చేశాయి. కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే కూటమిలో 94 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కాకుండా.. 14 సీట్లకే పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కూటమిని లీడ్ చేయడం మైనస్ అయ్యిందని అప్పట్లో అంచనాలు వచ్చాయి. అధికార పార్టీ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుని చంద్రబాబు బూచిని చూపుతూ తెలంగాణ సెంటిమెంట్ రగిలించింది.
మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే చక్రం తిప్పుతారని, మళ్లీ ఆంధ్ర పాలనే వస్తుందని ప్రచారం చేసింది. ప్రజల్లోకి అది బలంగా వెళ్లడం, ప్రభుత్వంపై ఇప్పుడున్నంత వ్యతిరేకత అప్పటికి లేకపోవడం వంటి కారణాలు బీఆరెస్‌కు బాగా కలిసొచ్చాయి. చంద్రబాబును బూచిగా చూపెట్టడం వల్ల కేసీఆర్ ఊహించిన దానికంటే ఎక్కువ 88 సీట్లు వచ్చాయి. ఫలితాల అనంతరం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపడంతో బీఆరెస్ బలం 90కి చేరింది. మిత్రపక్షం ఎంఐఎంను కలుపుకొంటే ప్రభుత్వ బలం 97కు పెరిగింది. బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బాకాలు ఊదిన బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటుకే పరిమితం కాగా, వందకు పైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. కేసీఆర్ ఆరు నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేసినా, ఎన్నికల ఫలితాల తర్వాత ఆరు నెలలకు పూర్తిస్థాయి క్యాబినెట్ ను ఏర్పాటు చేసినా వాటిపై పత్రికల్లో వార్తలు రాలేదు, ప్రసారమాధ్యమాల్లో పెద్దగా చర్చ జరగలేదు. కానీ ప్రజలు గ్రహించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌కు షాక్ ఇచ్చారు. 9 స్థానాలకే పరిమితం చేసి, బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3 స్థానాలు కట్టబెట్టారు.
ఆరు నెలలకే వ్యక్తమైన ప్రజావ్యతిరేకత!
ఈ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఆరు నెలలకే వ్యక్తమైంది. కానీ ప్రతిపక్షమే ఉండొద్దు అన్నట్టు 19 మంది శాసనసభ్యులున్న కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి 12 మంది పార్టీ ఫిరాయించేలా అధికారపార్టీ వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి వందకుపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ బలోపేతానికి కేసీఆర్ బాటలు వేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీది వాపే తప్ప బలుపు కాదని తేలింది. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటేనని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ వైపల్యాలను అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో విజయం సాధించింది. దాని ఫలితమే ప్రస్తుతం సర్వేల్లో ఆపార్టీ ముందంజలో కనబడటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌కే మేలు!
బీజేపీ ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలనుకున్న వ్యూహం బెడిసికొట్టడం, తాజాగా టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు, జనసమితి, బీఎస్పీ ఈసారి ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమ లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఈ సమయంలో టీడీపీ బరిలో నిలవకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశాలు తగ్గిపోయాయని అంటున్నారు. రాజకీయాల్లో శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించి చంద్రశేఖర్‌రావుకు షాక్ ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల మాదిరిగా ఆంధ్ర పాలన బూచిని చూపెట్టే అవకాశం అధికారపార్టీకి ఉండదని చెబుతున్నారు.
దీంతోపాటు.. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి కూకట్‌పల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం ఏరియాల్లో టీడీపీకి బలమైన ఓటింగ్ ఉన్నది. అంతేకాకుండా.. ఈ ప్రాంతాల్లో ఏపీ నుంచి వలస వచ్చినవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఇందులోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇప్పటికే కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఆంధ్ర సరిహద్దు సమీపాన ఉండే కోదాడ, హుజూర్‌నగర్, అటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి చోట్ల కూడా గట్టి ఓటింగే ఉన్నదని చెబుతారు. టీడీపీకి సహజసిద్ధంగానే అభిమానులు తెలంగాణలో ఉన్నారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో యావత్ స్టేడియం కిక్కిరిసోయింది. టీడీపీ కనుక బరిలో నిలబడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్పష్టంగా చీలిపోతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో ఆందోళనలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతించలేదు. దీనిపైనా టీడీపీ కోపంతో ఉన్నది. ఈ సమయంలో పోటీకి దిగితే.. అది కేసీఆర్‌కే లాభిస్తుందని భావించే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆంధ్ర ఓటింగ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపడం ఖాయమని అంటున్నారు.