వివిధ శాఖల్లో పని చేస్తున్న1049 మంది రిటైర్డ్ ఉద్యోగులు!
రిటైర్ అయినా ఇతర మార్గాల్లో ఇంకా ప్రభుత్వ సర్వీసులలోనే కొనసాగుతున్నవారిని ఇంటికి పంపించేందుకు కొత్త ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

- సీఎస్ చేతికి రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు
- వారందరినీ ఇంటికి పంపించే దిశగా కసరత్తు
విధాత: పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులను గత ప్రభుత్వం అడ్డగోలుగా నియమించుకున్నదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇలా పదవీ విరమణ చేసిన వారిని ఉద్యోగాల్లో కొనసాగించడం ద్వారా పదోన్నతులు నిలిచిపోయాయని, అలాగే కొత్త నియామకాలు కూడా సరిగ్గా జరగలేదన్న చర్చ జరిగింది. అయితే కొత్తగా కొలువుదీరిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులను ఇంటికి పంపించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎంత మంది రిటైర్డ్ ఉద్యోగులు పని చేస్తున్నారో చెప్పాలన్న సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి వివిధ శాఖల కార్యదర్శలను నివేదిక ఇవ్వాలని కోరారు. సీఎస్ ఆదేశాల మేరకు అన్ని శాఖల్లో 1049 మంది రిటైర్డ్ అధికారులు పని చేస్తున్నట్లు జీఏడీకి నివేదిక అందింది. ఇలా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన జీఏడీ సీఎస్‌కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను సీఎస్ శాంతి కుమారి సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయనున్నారు.
రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వివిధ హోదాలలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వీరంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్ లు, కన్ఫర్డ్ ఐఏఎస్ లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులున్నట్లు గుర్తించారు. ఒక్క పురపాలకశాఖలోనే అత్యధికంగా 179 మంది అధికారులు ఉన్నట్లు తేలింది. ఆతరువాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, పౌరసరఫరాల శాఖలో 75మంది, రోడ్లు భవనాలశాఖలో 81 మంది, సాగునీటిపారుదల శాఖ 70 మంది అధికారులు ఉన్నట్లు తెలిసింది. వీరికి జీత భత్యాల రూపంలో నెలకు రూ. 150 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1800 కోట్ల లెక్కన గడచిన 10 ఏళ్లలో సగటున రూ.13 వేల కోట్లు చెల్లించింది. ఇలా పదవీ విరమణ చేసిన అధికారుల జీత భత్యాలతో ప్రభుత్వానికి పడిన భారం అని అంచనా జీఏడీ వేస్తున్నట్లు సమాచారం.