ఉమ్మడి ప్రాజెక్టుల పరిరక్షణకు కేంద్రంపై ఐక్య పోరాటం: హరీశ్‌రావు

ఉమ్మడి ప్రాజెక్టుల పరిరక్షణకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి పోరాటం చేసేందుకు బీఆరెస్‌ సిద్ధమని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

ఉమ్మడి ప్రాజెక్టుల పరిరక్షణకు కేంద్రంపై ఐక్య పోరాటం: హరీశ్‌రావు
  • ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆరెస్‌ నేత టీ హరీశ్‌రావు సూచన
  • వాటా తేల్చకుండా కేఆర్‌ఎంబీ స్వాధీనంతో తెలంగాణకు ఆన్యాయం
  • రాష్ట్ర హక్కుల సాధనకు బీఆరెస్ తెగించి పోరాడుతుందని వ్యాఖ్య

విధాత : కృష్ణా నది పరిధిలోని ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, అదే జరిగితే తెలంగాణకు నష్టం..ఏపీకి లాభం జరుగుతుందని, దీనిపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలని, ఇందుకు బీఆరెస్ మద్దతుగా వస్తుందని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) పరిధిలోకి వారం రోజుల్లోగా వెళతాయని తాజాగా ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్ లో నిర్ణయమైనట్టుగా తెలుస్తోందన్నారు. అదే జరిగితే ఏపీకి లాభం తెలంగాణకు నష్టమన్నారు. తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లని, రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్‌లో మాట్లాడుతామని, రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న ఉమ్మడి ప్రాజెక్టులపై రాష్ట్ర హక్కుల పరిరక్షణకు బీఆరెస్ ఎంతదాకైనా తెగించి పోరాడుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటవుదాం..ఎన్నికలపుడు రాజకీయాలు మాట్లాడుకుందామన్నారు. జూలై 2021 లోనే కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించగా, కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారన్నారు. మేము ఆనాడు కొన్ని షరతులు పెట్టామని, వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదన్నారు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలనపుడు కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారన్నారు. కృష్ణా నీటిని ఏపీకి 50 శాతం తెలంగాణకు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతు పెట్టామన్నారు. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీ ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేయాలని మరో షరతు పెట్టామన్నారు. ఏక పక్షంగా కేఆర్‌ఎంబీ పై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని మేము ఆనాడే కోరామన్నారు. ఒక సంవత్సరంలో వాడుకోని నీటిని మరో సంవత్సరం వాడుకునేలా వెసలు బాటు కల్పించాలని కేంద్రాన్ని నాడు కోరామన్నారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు.

కేంద్ర పెత్తనానికి ఒప్పుకున్నారా

ప్రస్తుత ప్రభుత్వం గుడ్డిగా కేఆర్‌ఎంబీ ఏర్పాటుకు ఒప్పుకున్నదని వార్తలు వస్తున్నాయన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమని చెమితే ఒప్పుకున్నట్టుగానే కేఆర్‌ఎంబీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుందన్నారు. ఇది ఏపీ సీఎం జగన్ విజయం అన్నట్టుగా వార్త కథనాలు వెలువడుతున్నాయని, ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళితే జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దాదాపు 5 వేల మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ను మనం కోల్పోతామన్నారు. కేఆర్‌ఎంబీ చేతిలో ప్రాజెక్టులు పెడితే మనకు ఇష్టం ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉండదన్నారు. కేఆర్‌ఎంబీకి దరఖాస్తు పెట్టి వాళ్ళు అనుమతించే లోపు గ్రిడ్ కుప్ప కూలుతుందన్నారు. జల విద్యుత్ ను కొన్ని సెకన్లలోనే ఉత్పత్తీ చేసుకోవచ్చని, అదే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదలు కావడానికి తొమ్మిది గంటలు పడుతుందన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి కూడా వీలు పడదన్నారు. నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల పై కూడా కేఆర్‌ఎంబీ ప్రభావం ఉంటుందన్నారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టుపై కూడా కేఆర్‌ఎంబీ ఎఫెక్ట్ ఉంటుందన్నారు. హైదరాబాద్ కు తాగు నీళ్ల సమస్య కూడా ఏర్పడుతుందన్నారు.

అది తెలంగాణకు ఆత్మహత్య సదృశ్యమే

కేఆర్‌ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులు చేరిస్తే తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమేనని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని, రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బీఆరెస్‌ పోరాటం చేయక తప్పదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే బీఆరెస్‌కు ముఖ్యం..ఎంతకైనా తెగిస్తాం

రాష్ట్ర ప్రయోజనాలే బీఆరెస్‌కు ముఖ్యమని, అందుకోసం ఎంతకైనా తెగిస్తుందన్నారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానే అన్నారు. సీలేరు ప్రాజెక్టును కాంగ్రెస్ బీజేపీ లు ఒక్కటై తెలంగాణకు దక్కకుండా చేశాయన్నారు. ఇపుడు కూడా తెలంగాణకు ఆ రెండు పార్టీలు ద్రోహం చేస్తున్నాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని, ఎండా కాలంలో రైతుల పంటలకు నష్టం కలగకుండా ఉండాలంటే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడుకోవాలన్నారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలని, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడప కూడదని, మా మీద బురద జల్లేందుకు కాళేశ్వరంపై రోజుకో లీకు ఫేక్ వార్తను ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు.