వరంగల్ నుంచి లోక్‌సభకు అద్దంకి?.. అందుకే ఎమ్మెల్సీ ఇవ్వనిది!
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ను లోక్‌సభకు పంపాలనే అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది.

విధాత: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమ కారుడు, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన అద్దంకి దయాకర్‌కు మొదట ఎమ్మెల్సీ ఇస్తున్నామని ప్రకటించి, చివరి నిమిషంలో మార్చడం వెనుక ఇతర ఆలోచనలు ఉన్నాయని తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డి అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరినా అధిష్ఠానం కావాలనే మార్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒప్పించినట్లు సమాచారం.
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడని పేరున్న దయాకర్‌ను లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచన ఉందన్న చర్చ జరుగుతున్నది. దయాకర్‌కు వరంగల్ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. టీవీ చర్చల్లో సమర్ధవంతంగా పార్టీ వాదనను వినిపించే దయాకర్ పార్లమెంటుకు వస్తే బీజేపీని నిలువరించే విధంగా మాట్లాడుతారన్న అభిప్రాయం కూడా అధిష్ఠానం పెద్దల్లో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అందుకే తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేసిన అద్దంకి దయాకర్‌ను పార్లమెంటుకు తీసుకు వెళ్లాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు సమాచారం.