కృష్ణ జన్మభూమి కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

షాహీ ఈద్గా మసీదు-శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో మసీదు కాంప్లెక్స్‌ను సర్వే చేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

కృష్ణ జన్మభూమి కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశాలు
  • షాహీ ఈద్గా సర్వేకు అనుమతి
  • విధివిధానాలపై 18న నిర్ణయం

అలహాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఇది తమదేనని హిందువులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీన్ని సర్వే చేయించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంలో గురువారం విచారణ చేపట్టిన అలహాబాద్‌ హైకోర్టు.. షాహీ దర్గా కాంప్లెక్స్‌ను సర్వే చేసేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలో అడ్వొకేట్‌ కమిషనర్‌ ద్వారా సర్వే జరగాలని పేర్కొన్నది. ఈ కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ పిటిషన్‌ను కోర్టు ఆమోదించిందని తెలిపారు. విధి విధానాలను ఈ నెల 18న నిర్ణయిస్తారని వెల్లడించారు.


ఈ కేసులో షాహీ ఈద్గా మసీదు వర్గాల వాదనలను కోర్టు తిరస్కరించిందని ఆయన తెలిపారు. షాహీ ఈద్గా మసీదులో అనేక హిందూ ఆలయాల చిహ్నాలు, గుర్తులు ఉన్నాయని ఆయన అన్నారు. వాస్తవ స్థితిని అంచనా వేసేందుకు అడ్వొకేట్‌ కమిషనర్‌ అవసరమని చెప్పారు. కోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పు మైలురాయి వంటిదని పేర్కొన్నారు. కృష్ణుడి జన్మ ప్రదేశంలో 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసి, అక్కడ ఈద్గాను మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టులో 17 ఒరిజినల్‌ సూట్లు పెండింగ్‌లో ఉన్నాయి. షాహీ ఈద్గా మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడికి చెందినదిగా ప్రకటించాలనేది వాటన్నింటిలో ప్రధాన అభ్యర్థనగా ఉన్నది. దీనితోపాటు అక్కడ మసీదును ప్రతివాదులు తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వాలనేది కూడా ఉన్నది.


ఇదిలా ఉంటే.. మథుర కోర్టులో ఈ విషయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు మే 26న తనకు బదలాయించుకున్నది. నవంబర్ 16న తీర్పు రిజర్వ్ చేసింది. అయితే.. తనంతట తాను మథుర కోర్టులో పిటిషన్లను తనకు అలహాబాద్ హైకోర్టు బదలాయించుకోవడాన్ని సవాలు చేస్తూ షాహీ ఈద్గా మేనేజ్‌మెంట్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నవంబర్‌ 10న విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి లిస్ట్ చేసింది. గత నెలలో ప్రధాని నరేంద్రమోదీ మథురలోని శ్రీకృష్ణ జన్మ భూమి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. తన సందర్శన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.