బీఆర్‌ఎస్‌.. ఫ్యామిలీ లిమిటెడ్‌ కంపెనీ: ప్రొఫెసర్‌ కోదండరాం

గత బీఆరెస్‌ ప్రభుత్వం ఫ్యామిలీ లిమిటెడ్‌గా ప్రభుత్వాన్ని నడిపిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు.

బీఆర్‌ఎస్‌.. ఫ్యామిలీ లిమిటెడ్‌ కంపెనీ: ప్రొఫెసర్‌ కోదండరాం
  • ఆ పార్టీ పాలనలో తెలంగాణ నష్టపోయింది
  • నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండే
  • విసిగిపోయిన జనం మార్పు కోరుకున్నారు
  • అంత నిర్బంధాన్ని ఎన్నడూ చూడలే
  • అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం అయ్యాయి
  • నియంత్రణలేని ఖర్చులతో దిగజారిన ఆర్థిక స్థితి
  • మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు
  • తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం
  • విధాత వెబ్‌సైట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ

(విధాత ప్రత్యేకం)

గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ఎన్నడూ చూడని నిర్బంధాన్ని చవిచూడాల్సి వచ్చిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బీఆర్‌ఎస్‌ అనేది పార్టీ కాదని, అది ఫ్యామిలీ లిమిటెడ్‌ కంపెనీలా ప్రభుత్వాన్ని నడిపారని విమర్శించారు. స్వంత అవసరాలకే ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తెలంగాణ సమాజం చాలా నష్టపోయిందని విశ్లేషించారు. తెలంగాణలో అధికార మార్పిడి, పదేళ్ల గత ప్రభుత్వ పాలన, రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి, అస్తవ్యవస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రంలోనూ ప్రభుత్వం మార్పు ఎందుకు తదితర అంశాలపై తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం ‘విధాత’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇవీ వివరాలు..


గత ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం?

గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఎన్నడూ చూడని నిర్బంధాన్ని చవిచూడాల్సి వచ్చింది. పద్నాలుగేళ్లు ఉద్యమకాలంలో కలిసి పనిచేసిన వాళ్లు మాలాంటి వాళ్లతో ఫొటోలు దిగడానికి కూడా భయపడే పరిస్థితి. బీఆర్‌ఎస్‌ అనేది పార్టీ కాదు, ఫ్యామిలీ లిమిటెడ్‌ కంపెనీగా ప్రభుత్వాన్నినడిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరు. ధర్నాలు, ర్యాలీలు చేసుకునే స్వేచ్ఛ లేదు. పదేళ్లుగా అన్నిరకాలుగా విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించిన వాళ్లు ఇప్పుడు ఆ పార్టీ ఓటమికి కారణాలు చెబుతున్నారు. నాడు ప్రశ్నించే అవకాశం ఉన్నా, ప్రభుత్వ విధానాల లోపాలను ఎత్తిచూపే అవకాశాలున్నా మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. కానీ దాని డిజైన్‌ మార్చి లక్ష కోట్ల వరకు ఖర్చు చేస్తే పరిస్థితి ఇప్పుడు పిల్లర్లు కుంగిపోయాయి. ప్రజాధనం వృథా అయ్యింది. అప్పుడు మాలాంటి వాళ్లు ప్రశ్నిస్తే ఎద్దేవా చేసిన వాళ్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అంతేకాదు గ్రామీణ నీటి వ్యవస్థ ధ్వంసమైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సమిష్టి ప్రయోజనాల కన్నా స్వంత అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చారు. స్వంత అవసరాలకు అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తెలంగాణ సమాజం చాలా నష్టపోయింది.


యూనివర్సిటీల స్వయం సమృద్ధి, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఏం చేయాలి?

గత ప్రభుత్వ హయంలో యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయి. ఇప్పుడు యూనివర్సిటీలు స్వయం సమృద్ధి సాధించడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసే ఆలోచనలో ఉన్నది. ఆ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వర్సిటీలకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే విద్యావ్యవస్థ బాగు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఎలా ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వం యోచిస్తున్నది. విద్యావ్యవస్థ కుప్పకూలింది. ఒకప్పుడు ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలుంటే స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా పరిష్కారం దొరికేది. గత ప్రభుత్వంలో మంత్రి దగ్గరికి వెళ్లినా పరిష్కారమయ్యేది కాదు. మంత్రి అయినా తనతోని కాదని చెప్పలేని పరిస్థితి. కనీసం వాళ్లు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాసింది.


ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే…

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. గత ప్రభుత్వం నియంత్రణ లేకుండా అడ్డగోలుగా ఖర్చు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మూడు పనులు చేయాలి. ఒకటి గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పాలకులు తమ పేరు మీదికి మార్చుకున్న భూములను గుర్తించాలి. అందుకుగాను ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేయాలి. దాని సూచనల ఆధారంగా ఆ భూములు స్వాధీనం చేసుకోవాలి. వాటిని వేలం వేయడం ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇక ప్రభుత్వం పేదలపై కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిపై వివిధ పన్నులు వేయడం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది.


జాతీయ రాజకీయాల గురించి ఏం చెబుతారు?

వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ కచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారనే వాదన వినిపిస్తున్నది. అదే జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే కేంద్రంలోనూ కాంగ్రెసే ప్రత్యామ్నాయం కనుక రాష్ట్రంలోనూ ప్రజలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీనే కాదు, బీఆర్‌ఎస్‌కు కూడా ఓటు వేసినా ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తే ఆ పార్టీకి సీట్లు పెరుగుతాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నవాళ్లం అవుతాం.


మంత్రివర్గ విస్తరణలో మీకు అవకాశాలున్నాయా?

ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే బహిరంగంగా ప్రకటించింది. మంత్రివర్గంలో చేరిక వంటి అంశాలపై ఇప్పటి వరకు నిర్ణయం జరుగలేదు. కాంగ్రెస్‌తో మా పార్టీ కలిసి పనిచేయడంలో మేము ప్రజల పక్షాన ఒక అనుసంధానంగా వ్యవహరిస్తాం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం. ప్రజల పక్షాన మా గొంతు వినిపిస్తాం.