కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదానికి గురైంది.

హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాస్య నందిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పీఏ, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య నందిత
లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేష్‌పై 17,169 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో ఇలా దుర్మరణం చెందడం పట్ల బీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం వ్యవధిలోనే ప్రజాప్రతినిధులైనా తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
10 రోజుల కిందటే ప్రమాదం..
కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆమె వరుసగా మూడు ప్రమాదాలకు గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ఆమె హాజరయ్యారు. సభ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలో చెర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీకొట్టింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న ముందు టైర్ ఊడిపోయింది. ఎమ్మెల్యే లాస్య నందిత తలకు స్వల్ప గాయమైంది కూడా. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో నందిత సోదరి కూడా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఆమె ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. సిబ్బంది లిఫ్ట్‌ను బద్దలుకొట్టి బయటకు తీసుకొచ్చారు.
గతంలో కవాడిగూడ కార్పొరేటర్‌గా..
సాయన్న, గీతలకు లాస్య నందిత జన్మించింది. ఆమెకు ఇద్దరు సోదరీమణులు నమ్రతా, నివేదిత. లాస్య కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి కవాడిగూడ కార్పొరేటర్‌గా కూడా పని చేశారు.