ఆ నాలుగు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం : గవర్నర్

హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 11 కోట్ల పైబడి మహిళా సోదరీ మణులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎంతో సంతోషకరం. మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి ప్రజల మొఖాలలో ఆనందం చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని ఆమె స్పష్టం చేశారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ తమిళిసై పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు.
గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, వ్యవస్థలు గాడి తప్పినా అన్నింటినీ సంస్కరించకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందని గవర్నర్ స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమే. ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాం. ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ప్రస్తుతం శాఖల వారిగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందుతోంది అని తెలిపారు.
గడచిన పదేళ్ల పాలకుల వైఫల్య ఫలితం… యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. తెలంగాణ ఉద్యమ సారథులైన యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు అని గవర్నర్ చెప్పారు.