రైతులకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటాం : గ‌వ‌ర్న‌ర్

రైతులకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటాం : గ‌వ‌ర్న‌ర్

హైద‌రాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి… తద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నాను అని అన్నారు. 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పాల్గొని జాతీయ జెండా ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగించారు.

రైతుల విషయంలో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతో పాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రైతులకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాం అని గ‌వ‌ర్న‌ర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉంది. మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సచివాలయంలో సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది. ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంద‌న్నారు గ‌వ‌ర్న‌ర్.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైంది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని… సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని మనసారా కోరుకుంటున్నాను అని పేర్కొంటూ గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.