ఇప్పుడంతా హ‌నుమాన్‌పైనే సినిమాలు…నిన్న తేజ రేపు చిరంజీవి ఆ త‌ర్వాత నిఖిల్

ఇప్పుడంతా హ‌నుమాన్‌పైనే సినిమాలు…నిన్న తేజ రేపు చిరంజీవి ఆ త‌ర్వాత నిఖిల్

ఈ మ‌ధ్య కాలంలో మ‌న తెలుగు సినిమాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల దృష్టిని ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. వినూత్న‌మైన సినిమాలు వంద కోట్ల క‌లెక్ష‌న్స్ తెచ్చిపెడుతున్నాయి. అయితే రెగ్యుల‌ర్ కంటెంట్ కాకుండా వైవిధ్య‌మైన కంటెంట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసే ప్ర‌యత్నం చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ మ‌ధ్య హ‌నుమాన్‌పైన ఎక్కువ సినిమాలు రూపొందుతుండ‌డం ఆస‌క్తిని రేపుతుంది. తిరిగి హ‌నుమాన్ శ‌కం ప్రారంభ‌మైందా అనే సందేహం క‌లుగుతుంది. హనుమంతుడి గురించి ముందు తరాలకి, బయట దేశాలకి కూడా తెలియడానికి ఇప్పుడు సినిమాల్లో ఆంజనేయస్వామి రిఫరెన్సులు ఎక్కువ‌గా తీసుకుంటున్నారు.

గతంలోనే పలు సినిమాల్లో ఆంజనేయస్వామి రిఫరెన్సులు ఎన్నో ఉన్నాయి. హనుమంతుడి మీద పాటలు ఎంతో ప‌వ‌ర్ ఫుల్‌గా రూపొందించ‌గా, అవి ప్రేక్ష‌కులని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక హీరో హ‌నుమంతుడి క‌రుణతో ప‌వ‌ర్‌ఫుల్‌గా మారి విల‌న్స్‌ని ఇర‌గ‌దీయడం వంటివి కూడా చూశాం.జగదేకవీరుడు అతిలోక సుందరి, శ్రీ ఆంజనేయం, ఊసరవెల్లి, సుప్రీమ్.. లాంటి సినిమాల్లో ఆంజనేయస్వామి రిఫరెన్సులు వాడారు. ఇక హనుమాన్ గ్రాఫిక్ మూవీ, లెజెండ్స్ అఫ్ హనుమాన్ సిరీస్.. వంటివి కూడా వచ్చి మెప్పించాయి.ఇప్పుడు తిరిగి హ‌నుమాన్‌పైన చాలా సినిమాలు రూపొందుతున్నాయి. ఇది గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి.

కొద్ది నెల‌ల క్రితం ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తీయ‌గా,ఇందులో ఆంజనేయస్వామి పాత్రని చక్కగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సంక్రాతికి వచ్చి భారీ హిట్ కొట్టిన హ‌నుమాన్ సినిమా మొత్తంలో హ‌నుమాన్ రిఫ‌రెన్స్ ఉంది. చివర్లో డైరెక్ట్ గా ఆ ఆంజనేయస్వామే రావడంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభర సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాలో కూడా హనుమంతుడి రిఫరెన్స్ ఉందని తెలుస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన విశ్వంభర గ్లింప్స్ చూస్తే అది స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఇక యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం స్వయంభు అనే భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసి.. స్వయంభు సినిమాలో నేను కూడా హనుమంతుడి భక్తుడిని. ఈ సినిమాలో కూడా జై శ్రీరామ్ అంటాము అని తెలిపాడు. ఇక రానున్న రోజుల‌లో ఇంకెంత మంది హీరోలు హ‌నుమాన్ రిఫ‌రెన్స్‌ని వాడి సినిమాలు తీస్తారో చూడాలి.