Parliament security Breach | పార్లమెంట్‌లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది..? లోపం ఎలా జరిగింది..?
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే పార్లమెంటులోకి నిందితులు ఎలా చొరబడ్డారన్ని అంతుచిక్కకుండా ఉన్నది.

Parliament security Breach | పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం. దేశంలో అత్యంత భద్రత ఉండే ప్రాంతాల్లో పార్లమెంట్ ఒకటి. ఎంతో పటిష్టమైన సెక్యూరిటీ ఉండే పార్లమెంట్‌లో ఒక్కసారిగా భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. భారత పార్లమెంట్‌పై దాడి జరిగిన 22 సంవత్సరాల తర్వాత అదే రోజున మళ్లీ ఈ ఘటన చోటు చేసుకున్నది. రెండు ఘటనలకు పొంతన లేకపోయినప్పటికీ.. తాజాగా జరిగిన ఘటన పార్లమెంట్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ అయితే, పార్లమెంట్‌లో ఎలాంటి భద్రత ఉంటుంది..? ఎవరిని అనుమతిస్తారు..? ఎలాంటి తనిఖీలు ఉంటాయో తెలుసుకుందాం రండి..!
2021 డిసెంబర్ 13న ఉగ్రవాదులు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌పై దాడికి దిగిన తెలిసింది. ఉగ్రవాదుల ఘాతుకానికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో కేంద్రం భద్రతను భారీగా పెంచింది. పార్లమెంట్‌లోకి ప్రవేశించడంపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులతో పాటు అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషన్లు, సిబ్బంది మినహా ఇతరులకు పార్లమెంట్ ప్రాంగణంలోకి కాలు పెట్టడానికి అనుమతి లేదు. సందర్శకులు మాత్రం ఎంపీల ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్ పొంది సందర్శకుల పాస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాత పాస్‌లను జారీ చేస్తుంటారు. అయితే, విజిటర్స్ ప్రవర్తనకు సంబంధించి ఆయా పార్లమెంట్ సభ్యులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
పార్లమెంట్ చుట్టూ భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్స్‌ను క్షుణ్ణంగా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాల్సి ఉంటుంది. మొదట పార్లమెంట్‌లోని ప్రవేశ ద్వారం వద్ద తనిఖీ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్ వద్ద మరోసారి తనిఖీ చేస్తారు. చివరిసారిగా విజిటర్స్ గ్యాలరీకి వెళ్లే మార్గంలోని కారిడార్‌లో తనిఖీ చేస్తుంటారు. పార్లమెంట్‌లో పని చేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా ఈ శిక్షణ ఉంటుంది. పార్లమెంట్‌లో పనిచేసే సిబ్బంది అంతా నిత్యం ఐడీకార్డును ధరించాల్సి ఉంటుంది. సమయానుసారంగా భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారు. మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లు, ఫుల్ బాడీ స్కానర్స్ తదితర అనుధాన డివైజెస్‌తో భద్రత ఉంటుంది.
ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు అగంతకులు సభలో గందరగోళం సృష్టించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి.. ఎంపీ టేబుల్స్‌పై నుంచి స్పీకర్ చైర్ వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ స్మోక్ క్యాన్‌ను పట్టుకోగా.. మరో వ్యక్తి విజిటర్స్ గ్యాలరీలోనే స్మోక్ క్యాన్‌లను పట్టుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎంపీలు షాక్ అయ్యారు. పలువురు ఎంపీలు నిందితుడిని పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే, మూడంచెల భద్రతా తనిఖీలు, మెటల్ డిటెక్టర్‌లను దాటుకొని పార్లమెంట్ భవనం లోపలికి ఎలా వచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ఘటన పార్లమెంట్ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నది.