KTR | ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో.. కేటీఆర్ ట్వీట్

KTR | కర్ణాటకలో కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ ఇవ్వాలని కర్ణాటక రైతులు సబ్ స్టేషన్ల వద్ద, విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా విద్యుత్ కార్యాలయాల వద్దకు మొసళ్లను ట్రాక్టర్లో తీసుకెళ్లి, విద్యుత్ సరఫరా చేయకపోతే మొసళ్లను ఆఫీసుల్లో వదిలేస్తామని రైతులు బెదిరింపులకు గురి చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అని క్యాప్షన్ ఇచ్చారు కేటీఆర్.
ఇక పగటి పూట త్రీఫేజ్ ఇవ్వకుండా, అర్ధరాత్రి దాటిన తర్వాత ఇవ్వడంతో పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో పొలాలకు వెళ్తున్నప్పుడు పిల్లకాలువల నుంచి మొసళ్లు, వన్యప్రాణులు అడ్డు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన ఓ మొసలిని రైతులు పట్టుకొచ్చి, విద్యుత్ అధికారులు బెదిరిస్తున్నారు. అయితే ఆ మొసలిని అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకుని, సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో