Minister Ponnam Prabhakar | పంచాయతీల్లో ప్రత్యేక పాలన
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీ కాలం జనవరి 31తో ముగిసిపోనుండగా, ఫిబ్రవరి 1నుంచి అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం పొడగించడానికి వీల్లేదన్నారు. ప్రజా సమస్యలపై ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా సమర్ధవంతంగా పాలించిన సర్పంచ్లకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు.
గ్రామాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటి పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కుల గణన కూడా జరుగనుందని, స్థానిక సంస్థల ఆధారంగా రిజర్వేషన్ల మార్పులు చేర్పులు కూడా జరుగుతాయన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ ఉంటుందన్నారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిందన్నారు. పోలీస్ శాఖ ఇనహా పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, విద్యా, వైద్య శాఖల అధికారులు, ఉద్యోగులను పంచాయతీ ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లుగా తెలిపారు.