బీహార్‌కు తొమ్మిదోసారి సీఎంగా నితీశ్‌

బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ మరోసారి పగ్గాలు చేపట్టారు. ఈసారి ఆయన బీజేపీ మద్దతు తీసుకున్నారు.

బీహార్‌కు తొమ్మిదోసారి సీఎంగా నితీశ్‌

పాట్నా: బీజేపీ మద్దతుతో బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. ఆయన తొమ్మిదోసారి ముఖ్యమంత్రి కావడం ఒక విశేషమైతే.. ఏడాది వ్యవధిలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం మరో విశేషం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జీతన్‌ రామ్‌ మాంఝీ, చిరాగ్‌ పాశ్వాన్‌, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నితీశ్‌ ప్రమాణం చేసిన సమయంలో అక్కడివారంతా భారత్‌ మాతా కీ జై, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. నితీశ్‌తోపాటు బీజేపీకి చెందిన సమ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా, మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతకు ముందు ఉదయం 10.15 గంటలకు నితీశ్‌ కుమార్‌ ఇంట్లో జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు విడిగా వీర్‌చాంద్‌ పటేల్‌ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు.


ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా సమర్పించేందుకు రాజ్‌భవన్‌కు రానున్నారన్న వార్తలతో అక్కడ భద్రతను పటిష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నితీశ్‌ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌కు అందించారు. దానితోపాటు తనకు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదంటూ తగిన పత్రాలు అందించారు. ఆ వెంటనే నితీశ్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ చేసి అభినందించారు. రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నితీశ్‌కుమార్‌.. సంకీర్ణ కూటమిలో మునుపెన్నడూ లేని పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ‘సంకీర్ణంలో పరిస్థితులు సానుకూలంగా లేవు. పార్టీ నేతలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నేను నా రాజీనామా సమర్పించాను’ అని తెలిపారు. మరోవైపు మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూతో సంయుక్త సమావేశం కోసం నితీశ్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎన్డీయే పక్ష నాయకుడిగా నితీశ్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం ఆయన గవర్నర్‌ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరారు.