ఏపీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయడంపై పీకే క్లారిటీ
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారని ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అమరావతి: రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారని ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 23న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద కనిపించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. అనంతరం ఆయన విజయవాడలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలుసుకుని చర్చలు జరపడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పీకే పనిచేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. తాను టీడీపీతో కలిసి పనిచేయబోవటం లేదని ప్రశాంత్ కిశోర్ తాజాగా వివరణ ఇచ్చారు. లల్లన్‌టాప్ ఎడిటర్ సౌరభ్ ద్వివేదితో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్.. ‘అవును నేను చంద్రబాబు నాయుడిని ఒక ఉమ్మడి స్నేహితుడి ఒత్తిడిపై ఇటీవల విజయవాడలో కలిశాను. ఈ ఎన్నికల్లో తమకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. అయితే.. ఆ పని తాను వదిలేశానని, ఏపీ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించడం లేదని ఆయనకు స్పష్టం చేశాను’ అని తెలిపారు. 2019 ఎన్నికల్లో తాను వైఎస్సార్సీపీకి పని చేశానని, తర్వాత పొలిటికల్ కన్సల్టెన్సీ పని వదిలేశానని చెప్పానని పేర్కొన్నారు. అయితే.. ప్రశాంత్ కిశోర్ బృందంలోని సభ్యుడు రాబిన్ శర్మ కొంత కాలంగా టీడీపీ కోసం పనిచేస్తుండటం విశేషం.
ప్రశాంత్ కిశోర్ గతంలో నాయకత్వం వహించిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) ఇప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కోసం పనిచేస్తూనే ఉన్నది. 2024 ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నది. కిశోర్ రాజీనామా అనంతరం కొత్త సీఈవో దీనిని నాయకత్వం వహిస్తున్నారు. అయితే.. ఏపీలో జగన్‌తో కూడా తాను ఎలాంటి భాగస్వామ్యం కలిగి లేనని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. పీకే గతంలో బీజేపీకి పనిచేశారు. జేడీయూ, కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ తదితర పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి, ఆయా పార్టీలకు విజయాలను అందించారు.