పీవోకే మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే మనదేనన్నారు. మన స్వాధీనంలోకి వచ్చాక అక్కడ 24 నియోజకవర్గాలు ఉంటాయని తెలిపారు.

పీవోకే మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం
  • వలసపోయిన పండిట్లకు చట్టసభల్లో అవకాశం
  • నెహ్రూ తప్పిదాల వల్లే పీవోకే సమస్య
  • లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌దేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. పీవోకే కోసం 24 సీట్లు రిజర్వ్‌ చేశామని తెలిపారు. పీవోకే సమస్య ఉత్పన్నమైనదే నెహ్రూ చేసిన ఘోర తప్పిదాల వల్ల అని విమర్శించారు. జమ్ముకశ్మీర్‌ (సవరణ) బిల్లు, జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థకరణ (సవరణ) బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు బుధవారం ఆయన సమాధానమిచ్చారు. ’గతంలో జమ్ములో 37 సీట్లు ఉండేవి. ఇప్పుడు 43. గతంలో కశ్మీర్‌లో 46 సీట్లు ఉండేవి. ఇప్పుడు 47. పీవోకే మనదైన తర్వాత కోసం 24 సీట్లను పీవోకేలో రిజర్వ్‌ చేశాం’ అని ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్‌ ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన రెండు ఘోరమైన తప్పిదాలే కారణమని విమర్శించారు. అందులో ఒకటి కాల్పుల విరమణ ఒకటైతే.. రెండోది కశ్మీర్‌ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి తీసుకుపోవడమని చెప్పారు. అయితే.. నెహ్రూపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పలువురు కాంగ్రెస్‌ సభ్యలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అనే సమస్యల పంటిట్‌ నెహ్రూ వల్లనే తలెత్తింది. లేదంటే ఆ భాగం కశ్మీర్‌లోనే ఉండి ఉండేది. పీవోకే బాధ్యత నెహ్రూదే’ అని అమిత్‌షా అన్నారు. ‘అది తప్పిదమేనని నెహ్రూ అన్నారు. అది తప్పు మాత్రమే కాదు.. అంత భూభాగాన్ని కోల్పోవడం ఘోరమైన తప్పిదం’ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీలు వాకౌట్‌ చేయడంపై స్పందిస్తూ.. ‘నేను ఘోరమైన తప్పిదం అన్నందుకే కలతపడ్డారు. అదే నేనుకనుక ‘హిమాలయమంత తప్పు’ అని చెప్పి ఉంటే.. వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోయేవారు’ అని వ్యాఖ్యానించారు.


హక్కుల పునరుద్ధరణకే బిల్లులు

గత డెభై ఏళ్లుగా కనీస హక్కులకు దూరమైన ప్రజలకు న్యాయం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ బిల్లులను తీసుకొచ్చిందని అమిత్‌షా చెప్పారు. నిర్వాసితులైన వారికి చట్టసభల్లో తమ గొంతు వినిపించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.


2026 టార్గెట్‌

ఒక్క ఉగ్రవాద ఘటన కూడా జరగకుండా ఒక ప్రణాళిక గత మూడేళ్లుగా ఉన్నదని, 2026 నాటికి అది ఫలితాలనిస్తుందని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, 2026 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఒక్క ఉగ్రవాద ఘటన కూడా ఉండబోదని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వాతావరణాన్ని నిర్మూలించేండంపై తాము దృష్టి సారించామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా ఇప్పటి వరకూ 45వేల మంది చనిపోయారని అమిత్‌షా వెల్లడించారు.


ఉగ్రవాదంపై చర్యలు తీసుకుని ఉంటే..

ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉగ్రవాదంపై చర్యలు తీసుకుని ఉంటే.. కశ్మీరీ పండిట్లు కశ్మీర్‌ లోయను వీడి వెళ్లిపోయేవారు కాదని అన్నారు. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్‌ను వదిలిపోయినవారికి చట్టసభల్లో అవకాశం కల్పించడం ఒక బిల్లు ఉద్దేశమని చెప్పారు. కశ్మీరీలు తమ దేశంలోనే శరణార్థులయ్యారని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 46,631 కుటుంబాలు.. 1,57,968 మంది పండిట్లు తరలిపోయారని చెప్పారు.


వెనుకబడిన వర్గాల దుస్థితికి కాంగ్రెస్‌ కారణం

వెనుకబడిన తరగతుల వారి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని అమిత్‌షా అన్నారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాలను వ్యతిరేకించిన లేదా వారి అభివృద్ధికి అడ్డుపడిన పార్టీ ఏదన్నా ఉంటే.. అది కాంగ్రెస్‌ పార్టీయేనని మండిపడ్డారు. నరేంద్రమోదీ పేద కుటుంబంలో పుట్టారని, వెనుకబడిన తరగతుల కష్టాలు ఆయనకు తెలుసని చెప్పారు.