నాగార్జునసాగర్ వివాదం వెనుక ఇదా అసలు సంగతి?
పోలింగ్‌కు ముందు అర్ధరాత్రి నుంచి మొదలైన నాగార్జున సాగర్ వివాదం.. ఎట్టకేలకు ముగిసింది.

- 28వ తేదీకి ముందున్నపరిస్థితిని కొనసాగించండి
- సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించండి
- కేంద్రం ప్రతిపాదనలను అంగీకరించిన తెలంగాణ, ఏపీ
విధాత, హైదరాబాద్: పోలింగ్ ముగిసింది.. వివాదం సమసింది. పోలింగ్‌కు ముందు రాత్రి ఏపీ పోలీసులు హడావిడి చేసి నాగార్జున సాగర్ డ్యామ్‌పైకి వచ్చి బలవంతంగా కుడికాలువకు నీటిని విడుదల చేసుకున్నారు. తెలంగాణ పోలీసులను అడ్డుకున్నారు. ఈ హడావిడితో తెలంగాణ, ఏపీల మధ్య నీటి యుద్ధం తప్పదా అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఇతంగా తెలంగాణ సెంటిమెంట్ లేసి బీఆరెస్‌కు పరోక్షంగా లబ్ది చేకూర్చడానికే కేసీఆర్ రహస్యమిత్రుడు ఏపీ సీఎం జగన్ చేశారన్న చర్చ జరిగింది. కొన్నిచానళ్లు పత్రికలు జగన్నాటకం శీర్షికన కథనాలు కూడా రాశాయి. సోషల్ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం జరిగింది. అయితే పోలింగ్ అయింది. కానీ ఎక్కడా సెంటిమెంట్ రగలలేదు. అంతా చప్పగా సాగింది. 30వ తేదీ సాయంత్రం వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సీన్‌కట్ చేస్తే శుక్రవారం డిసెంబర్ 1వ తేదీన తెలంగాణ ఏపీ పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసింది. సాయంత్ర వరకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి ఇరురాష్ట్రాలతో మాట్లాడడంతో సమస్య సమసిపోయింది. కేంద్రం ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈమేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
28 ముందుకున్నపరిస్థితి కొనసాగింపు
నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28 వ తేదీకి ముందు ఉన్నపరిస్థితిని కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. సాగర్ కుడికాలువ నీటి విడుదల, డ్యామ్‌పై ఏపీ సాయుధ పోలీసులను మొహరించిన అంశాలపై శనివారం కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శిఅజయ్కుమార్ భల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు కూడా హాజరయ్యారు.
శాంతి భద్రతల సమస్య సృష్టించారు
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, నవంబర్ 29 న రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, 5 , 7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందన్నారు. ఏపీ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇది రెండవసారన్నారు. 2014 నుండి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్-కో ని కొనసాగించాలని కేంద్రానికి ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పంధించిన కేంద్రం నాగార్జున సాగర్ డ్యాం పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్-కో కొనసాగించాలని, తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా పేర్కొన్నారు.