Prashant Kishor : రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ మార్పు!

రాబోయే 2025 బీహార్‌ అసెంబ్లీ నాటికి ఇప్పుడు ఏర్పడిన కూటమి మనుగడలో ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు.

Prashant Kishor : రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ మార్పు!
  • జేడీయూ-బీజేపీ కూటమి 2025లోపే ఖతం
  • బీహార్‌ ప్రభుత్వ భవిష్యత్తుపై ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Prashant Kishor : బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరిన నితీశ్‌కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆదివారం (28-1-2024) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో జేడీయూ-బీజేపీ- కాంగ్రెస్‌ మహాకూటమి ప్రభుత్వం ఎంత కాలం కొనసాగుతుందో ఆయన జోస్యం చెప్పారు. ఆర్జేడీ-జేడీయూ కూటమిని ముంచి, బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమి ఎంతో కాలం కొనసాగబోదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. బీహార్‌ అసెంబ్లీకి 2025లో ఎన్నికలు జరిగడానికి ముందే కూటమి విచ్ఛిన్నమవుతుందని చెప్పారు. అంతే మహా అయితే ఓ ఏడాది, అంతకంటే తక్కువకాలమే ఇది మనగలుగుతుందని అన్నారు. ‘ప్రస్తుతం ఏర్పడిన కొత్త పొత్తు వచ్చే బీహార్‌ ఎన్నికల దాకా ఉండదు. కావాలంటే మీకు రాసిస్తాను’ అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే మళ్లీ మార్పు ఉంటుందని అన్నారు. ఆదివారం ఉదయం రాజీనామా చేసిన నితీశ్‌కుమార్‌.. సాయంత్రం బీహార్‌ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు.. సమ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హా, ఆరుగురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు.


2022లో నితీశ్‌కుమార్‌ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న సమయంలో బీహార్‌లో ఇప్పటికైనా రాజకీయ సుస్థిరత నెలకొంటుందని భావించానని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడి రాజకీయ లేదా పరిపాలన పరమైన ఆకాంక్షలు నెరవేరనప్పుడు సమీకరణాలు మారుతాయని అన్నారు. 2013-14 నుంచి ఇప్పటి వరకూ ఆరుసార్లు కూటములు మారాయన్నారు. గతంలో తాను కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తానని చెబితే.. తాను బీహార్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని భావించానని తెలిపారు. గతంలో కూడా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమి 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉండదని తాను చెప్పానని గుర్తు చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ రాబోయే 2025 అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా అదే జరుగుతుందని భావిస్తున్నానని తెలిపారు. అయితే.. ఆయన ఎవరి వెంట వెళ్లినా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు 20 మించి స్థానాలు రావని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

 మహాఘట్‌బంధన్‌లో వ్యవహారాలు సరిగా లేకపోవడమే తాను కూటమి నుంచి వైదొలగడానికి కారణమని నితీశ్‌ చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు విన్న తర్వాతే తానీ నిర్ణయం తీసుకున్నానని గవర్నర్‌కు రాజీనామా పత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.