EMIలు భారం.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు
-రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ -గృహ, వాహన తదితర రుణాలన్నీ ప్రియం విధాత: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేటును పెంచింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ బుధవారం ద్రవ్యసమీక్ష అనంతరం ప్రకటించింది. దీంతో రెపోరేటు 6.5 శాతానికి చేరింది. మూడు రోజులపాటు జరిగిన ఈ ద్రవ్యసమీక్షలో మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు వడ్డీరేట్ల పెంపునకే మద్దతిచ్చారు. రుణగ్రహీతలపై భారం ఆర్బీఐ తాజా నిర్ణయంతో రుణాలపై […]

-రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
-గృహ, వాహన తదితర రుణాలన్నీ ప్రియం
విధాత: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేటును పెంచింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ బుధవారం ద్రవ్యసమీక్ష అనంతరం ప్రకటించింది. దీంతో రెపోరేటు 6.5 శాతానికి చేరింది. మూడు రోజులపాటు జరిగిన ఈ ద్రవ్యసమీక్షలో మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు వడ్డీరేట్ల పెంపునకే మద్దతిచ్చారు.
రుణగ్రహీతలపై భారం
ఆర్బీఐ తాజా నిర్ణయంతో రుణాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా రుణాలకు సంబంధించిన నెలసరి వాయిదా చెల్లింపులు (ఈఎంఐలు) భారం కానున్నాయి. నిరుడు డిసెంబర్‌లో చివరిసారిగా జరిగిన ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్లు పెంచింది.
కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా రెపోరేటును తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. గత ఏడాది మే నుంచి మితిమీరిన ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా పెంచుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే 4 శాతంగా ఉన్న రెపోరేటు ఇప్పుడు 6.5 శాతానికి వచ్చింది.
దాదాపు ఈ 10 నెలల్లో రెపోరేటు 2.5 శాతం (250 బేసిస్ పాయింట్లు) పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో మాత్రం ఇదే తొలిసారి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వడ్డీరేట్ల పెంపు ఇది ఆరోసారి. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి ద్రవసమీక్ష.
పరపతి విధానం ఓ సవాల్
ద్రవ్యసమీక్ష అనంతరం మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ద్రవ్య పరపతి విధానం ఓ సవాల్‌గా మారిందన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణంగా ఆయన పేర్కొన్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ద్రవ్యోల్బణం 4 శాతానికి మించే నమోదు కావచ్చని దాస్ అభిప్రాయపడ్డారు.
కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తమ కీలక వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది కూడా ఆర్బీఐ తాజా వడ్డింపులకు కారణమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి రెపోరేటును పెంచకపోతే విదేశీ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలావుంటే మార్జినల్ స్టాండిగ్ రేటును 6.75 శాతానికి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతానికి ఆర్బీఐ తెచ్చింది.