అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల కదలికలు సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. అయితే మంగళవారం మాత్రం కాస్తా శాంతించి స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ.1,50,100కు దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,65,000 వద్ద కొనసాగుతుంది.
హెచ్చు తగ్గులున్నా..పైపైకే..
పశ్చిమాసియా సంక్షోభంతో ఒడిదుడుకులకు లోనైన బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, ఫెడరల్ వడ్డీ రేట్ల మార్పులు, బ్రాండ్ మార్కెట్ జోక్యానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలతో బంగారం ధర ఔన్సుకు 4,600 డాలర్ల మార్కును సునాయాసంగా దాటేసింది. ఆగస్టు నెలలోనే బులియన్ మార్కెట్ దాదాపు 14 శాతం వరకు పెరిగి.. 4,631.67 డాలర్ల వద్ద తాజా గరిష్ట స్థాయిని తాకింది. జూలై చివరిలో 4,000 డాలర్ల కంటే దిగువకు పడిపోయిన బంగారం ధరలు.. ఆ తర్వాత ఊహించని వేగంతో పుంజుకోవడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మరోవైపు అంతర్జాతీయ కమోడిటీ రీసెర్చ్ సంస్థ యుబిఎస్ (UBS) బంగారం ధరల భవిష్యత్తుపై తీవ్ర సానుకూల ధోరణిని వ్యక్తం చేసింది. 2026 నాటికి 4,600 డాలర్ల స్థాయిని స్థిరపరుచుకుని.. వచ్చే ఏడాది మార్చి నాటికి 5 వేల డాలర్లు, 2027 జూన్ నాటికి ఏకంగా 5,200 డాలర్ల మార్కును పసిడి చేరుకోవచ్చని అంచనా వేసింది.
