Term Insurance Policy | టర్మ్ పాలసీ తీసుకొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీఎస్ఆర్ హిస్టరీ ప్రాముఖ్యత, పన్ను మినహాయింపులు వివరాలు.

ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పాలసీ సమయంలో ఎలాంటి అంశాలను భీమా కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి? భీమా కంపెనీల క్లైయిమ్ సెటిల్ మెంట్ల హిస్టరీ తెలుసుకోవాలని భీమారంగ నిపుణులు సూచిస్తున్నారు.
అసలు టర్మ్ పాలసీ అంటే ఏంటి?
ఇన్సూరెన్స్ చేసే సమయంలో ఏజంట్లు చెప్పే వివరాల కంటే వారిపై నమ్మకంతోనో, మోహమాటం కొద్దో పాలసీలు తీసుకుంటాం. చాలా మందికి ఆయా పాలసీల వివరాలను తెలుసుకొనే ఆసక్తి ఉండదు. పాలసీ అమౌంట్, ఎంత కాలపరిమితి వంటి అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో అన్ని అంశాల గురించి తెలుసుకోవాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించేదే టర్మ్ పాలసీ. ఇంటి పెద్ద లేని సమయంలో కుటుంబానికి అండగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకొన్న ముందుజాగ్రత్తలో భాగంగా టర్మ్ పాలసీని తీసుకుంటారు. ఇలాంటి పాలసీ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
టర్మ్ పాలసీ తీసుకొనే ముందు ఎంత మొత్తంలో పాలసీ ఉండాలనే దానిపై పాలసీ చేసే వ్యక్తికి స్పష్టత ఉండాలి. ఎప్పటి వరకు కాల పరిమితి ఉండాలి. మీ ఆర్ధిక పరిస్థితులకు ఏ పాలసీ సరిపోతోంది? ప్రీమియం చెల్లింపు మూడు నెలలా? ఆరు నెలలా? ఏడాదా? ఆప్షన్ ఎంచుకోవాలి? మీ కుటుంబ ఆదాయం, ఖర్చులు అంచనా వేసుకొని ఏ పాలసీని మీరు తీసుకోగలుగుతారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయంలో మొత్తం ఖర్చులు తీసివేస్తే మిగిలిన ఆదాయానికి 100 రెట్లు ఇన్సూరెన్స్ చేయాలనేది భీమారంగ నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే భీమా డబ్బులు ఎవరికి చెందాలి? ఒకేసారి భీమా డబ్బులు అందించాలా? నెలవారీగా పెన్షన్ మాదిరిగా భీమా మొత్తం పొందుతారా అనే విషయాలను కూడా స్పష్టంగా చెప్పాలి.
ఆదాయ పన్ను మినహాయింపు
టర్మ్ భీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. టర్మ్ భీమా ప్రీమియం ఏటా రూ. 1.50 లక్షల వరకు ఆదాయ పన్ను శాఖ ద్వారా పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. పాలసీ చేసిన వ్యక్తి మరణిస్తే ఆదాయ పన్ను అవసరం లేకుండానే భీమా మొత్తం కూడా నామినీ క్లైయిమ్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
సీఎస్ఆర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి
ఇన్సూరెన్స్ కంపెనీ సీఎస్ఆర్ హిస్టరీని తప్పకుండా పరిశీలించాలి. పాలసీ క్లైయిమ్ సెటిల్ మెంట్ నిష్ఫత్తినే సీఆర్ఎస్ అంటారు. ఒక్క భీమా సంస్థ ఎన్ని భీమా క్లైయిమ్ లు అందుకుంది? ఎన్ని పాలసీలను క్లైయిమ్ చేసిందనేది ముఖ్యం. సీఎస్ఆర్ పర్సంటేజీ 90 శాతం పైగా ఉంటే ఆ కంపెనీ క్లైయిమ్స్ సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు ఉండవనేది భీమా రంగ నిపుణుల మాట. అయితే ఒక్క కంపెనీ పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి ఐదేళ్లకు సంబంధించిన సీఎస్ఆర్ సగటును పరిశీలించాలి. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సమయంలో ఈ పాలసీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు సమర్పించిన 30 రోజుల్లో క్లైయిమ్ పూర్తి కావాలి.
ఇన్సూరెన్స్ కంపెనీల ఎంపిక
టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఎంపిక విషయం కూడా చాలా కీలకమైంది. ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్న భీమా సంస్థను ఎంచుకోవాలి. అంతేకాదు ఆ సంస్థ క్లైయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి మూడు నెలలకు అన్ని వివరాలను ఐఆర్‌డీఏ తన వెబ్ సైట్‌లో పెడుతుంది. దాన్ని చెక్ చేసుకోవాలి. పాలసీని ముందుగానే సరెండర్ చేసుకొంటే ఆ పాలసీకి చెందిన బెనిఫిట్స్ ను మినహాయించి పాలసీదారుడు చెల్లించిన ప్రీమియాన్ని కొన్ని సంస్థలు పాలసీదారుడికి అందిస్తాయి. అయితే పాలసీ తీసుకొనే సమయంలోనే వీటి విషయంలో భీమా కంపెనీ ఏజంట్లతో మాట్లాడాలి. లేదా ఆ కంపెనీ వెబ్ సైట్ లో దీని గురించి తెలుసుకోవాలి. భీమా చేసే సమయంలో తప్పుడు వివరాలు ఇవ్వవద్దు. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటిని దాచవద్దు.