Apollo: నర్సుల సేవలు.. వెలకట్టలేనివి

హైదరాబాద్: నిస్వార్థ సేవతో రోగులకు ఊపిరిలూదుతున్న నర్సులకు అపోలో హాస్పిటల్స్ నీరాజనం పలికింది. వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ యోధులకు అపోలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అభినందనలు తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘కృతజ్ఞతా గోడ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తోటి సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు తమ నర్సింగ్ హీరోల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖలు, గీసిన బొమ్మలు, అతికించిన ఫోటోలతో ఆ గోడ నిండిపోయింది. ఎంతో ప్రేమతో రాసిన ఆ సందేశాలను చదువుతూ నర్సులు భావోద్వేగానికి గురయ్యారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ – స్ట్రాటజీ, సిందూరి రెడ్డి మాట్లాడుతూ.. “మా నర్సులు ఆరోగ్య వ్యవస్థకు మూలస్తంభం. వారి సంరక్షణ మాకు అత్యంత ముఖ్యం. ప్రతి నర్సు సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంలో వృద్ధి చెందాలని, ప్రతి రోగికి అత్యుత్తమమైన సేవలు అందాలని మేము దృఢంగా నమ్ముతున్నాము. ‘ది పింక్ బుక్’ మా నర్సింగ్ సిబ్బంది కోసం సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని సృష్టించాలనే మా నిబద్ధతను తెలియజేస్తుంది” అన్నారు.
మన నర్సులు…. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ నర్సింగ్, కెప్టెన్ (డాక్టర్) ఉషా బెనర్జీ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం నినాదం ‘మన నర్సులు. మన భవిష్యత్తు. నర్సులను ఆదుకోవడం ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది’. నర్సులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు గుండె లాంటి వారు. వారి శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. వారి అమూల్యమైన కృషికి ఈరోజు మేము సెల్యూట్ చేస్తున్నాము. వారికి నిరంతర మద్దతునందిస్తాం” అని పేర్కొన్నారు.
అపోలో హాస్పిటల్స్ తెలంగాణ రీజియన్ నర్సింగ్ డైరెక్టర్ సునీత డొమింగో(Sunita Domingo) మాట్లాడుతూ… “ఇవాళ మన నర్సుల గురించి సంతోషంగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడి వాతావరణం చాలా ఉత్సాహభరితంగా ఉంది. నర్సులు ఎప్పుడూ రోగులకు సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనిని మనం గౌరవిద్దాం. పాటలు, డాన్సులు, మంచి మాటలు – ఇవన్నీ మనం ఎందుకు పనిచేస్తున్నామో చెబుతున్నాయి. వారి సేవలను గుర్తించి, గౌరవించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నర్సులు అందిస్తున్న సేవలు వైద్యం కంటే చాలా ఎక్కువ. మనమందరం కలిసి పనిచేయడానికి వారి తోడ్పాటు ఎంతో అవసరమని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
నర్సుల డే సందర్భంగా అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ క్యాంపస్, సిబ్బంది వసతి గృహాలలో సాంస్కృతిక ప్రదర్శనలు, వేడుకలు కూడా ఏర్పాటు చేశారు. నర్సులు స్వయంగా సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, చిన్న నాటకాలు ప్రదర్శించారు. ఇది రోగులకు సేవ చేయడంలో వారి ఐక్యతను మరియు ఉమ్మడి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.