సినీ కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం
మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయిన నిర్మాత సి.కళ్యాణ్, సినీ కార్మికుల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత సి.కళ్యాణ్.. మెగాస్టార్‌తో భేటీ
విధాత : సినీ కార్మికుల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయి సినీ కార్మికుల సమ్మెపై చర్చించారు. అనంతరం సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి రోజూ చిరంజీవి అందరితోనూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సినీ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం చిరంజీవితో సమావేశం కానున్నారని తెలిపారు. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని కళ్యాణ్ అన్నారు. కార్మికులతో తాను కూడా మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కంటే సినీ కార్మికులకు తెలంగాణలోనే ఎక్కువ టారిఫ్ అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. అసలు ఇండస్ట్రీలో ఉన్న ప్రాక్టికల్ సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఇరువర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారని ఆయన వివరించారు. కార్మికులను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్మిక శాఖ రూల్స్ ప్రకారం సినిమాలకు పనిచేయలేమన్నారు. ఓ కుటుంబంలో కలిసి ఎలా పనిచేస్తామో అలా తెలుగు సినీ పరిశ్రమలో పని చేయడం అలవాటు అయిందని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు.