Drishyam 3 |  జార్జ్‌కుట్టి మళ్లీ వస్తున్నాడు ‌‌– దృశ్యం 3 షూటింగ్​ మొదలు

దృశ్యం 3 చిత్రం మలయాళ వెర్షన్ ముందుగా రిలీజ్ కానుందని దర్శకుడు జీతు జోసెఫ్ స్పష్టత ఇచ్చారు. మోహన్‌లాల్ సెప్టెంబర్ 22న షూటింగ్ ప్రారంభించబోతుండగా, అజయ్ దేవగన్ హిందీ వెర్షన్ మాత్రం స్క్రిప్ట్ కోసం వేచి చూస్తోంది.

  • Publish Date - September 21, 2025 / 11:08 PM IST

Drishyam 3 |  సినిమా అభిమానులను ఎంతగానో అలరించిన థ్రిల్లింగ్​ చిత్రం దృశ్యం. రెండు భాగాలు అటు మలయాళం, ఇటు తెలుగు, హిందీలలో కూడా ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. మూడో పార్ట్​ ఉంటుందా? ఉండదా? అనే సందేహానికి సమాధానం ఇంతకుముందే వచ్చినా, థ్రిల్లింగ్​ న్యూస్​ మాత్రం ఇవాళే వచ్చింది. అవును.. దృశ్యం 3 ఎట్టకేలకు సెట్స్‌ పైకెక్కబోతోంది. గత రెండు భాగాల్లాగే ఈ సారి కూడా జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మిస్టరీతో నిండిన కథనానికి నిండుదనం తీసుకురానున్నారు.  కానీ ట్విస్ట్ ఏమిటంటే – మూడో భాగం ముందుగా మలయాళం ప్రేక్షకులనే పలకరించబోతోంది.

దృశ్యం 3 మలయాళం వెర్షనే ముందు

దృశ్యం విజయ సారథులు – జీతూ జోసెఫ్​, మోహన్​లాల్​, ఆంటోనీ పెరంబవూర్​

ముందుగా మలయాళం వెర్షన్‌నే విడుదల చేస్తామని, హిందీ టీం ఇంకా స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తోందని దర్శకుడు జీతు జోసెఫ్ తాజాగా స్పష్టం చేసారు . వారు స్వతంత్రంగా ఏదైనా ప్రయత్నిస్తే న్యాయపరంగా  ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో గందరగోళానికి చెక్ పడింది. ఇక ఆ థ్రిల్లింగ్​ అనుభవం మొదట మలయాళీ ప్రేక్షకులకే సొంతం కాబోతోంది. ఇక తెలుగులోనూ దృశ్యం రెండు భాగాలు పెద్ద హిట్​ అయ్యాయి కాబట్టి, మూడో భాగం కూడా వస్తుందని అనుకోవచ్చు. విక్టరీ వెంకటేశ్​ రెండు భాగాల్లోనూ నాయకుడిగా నటించగా, మరి మూడోభాగం గురించి ఇప్పటివరకు చర్చలేవీ వినబడటంలేదు.

దృశ్యం 3 షూటింగ్ సెప్టెంబర్ 22న కేరళలోని టొడుపుజాలో పూజా కార్యక్రమంతో మొదలవుతుందని మోహన్‌లాల్ స్వయంగా మీడియాకు ధృవీకరించారు. అంతే కాదు, మరుసటి రోజే, సెప్టెంబర్ 23న, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించబోతోంది. రెండు రోజుల వ్యవధిలో ఒకవైపు షూటింగ్ స్టార్ట్, మరోవైపు దేశ అత్యున్నత సినీ గౌరవం అందుకోవడం ఆయన కెరీర్‌లో మధుర క్షణాలుగా  నిలిచిపోనున్నాయి.

అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో హిందీ Drishyam 3 తెరకెక్కనుంది. కానీ బాలీవుడ్ టీం స్క్రిప్ట్ అందేవరకు ముందుకు కదిలే పరిస్థితి లేదు. అందుకే మలయాళ వెర్షన్ షూటింగ్ పూర్తి అయిన తర్వాతే హిందీ వెర్షన్ మొదలు కావచ్చు. అయినప్పటికీ అభిమానుల్లో ఆసక్తి మాత్రం తగ్గలేదు. మలయాళం ముందు చూశాక, హిందీ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలంటూ ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు.

2013లో వచ్చిన దృశ్యం జార్జ్‌కుట్టి తన కుటుంబ రహస్యాన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాల చుట్టూ తిరిగింది. 2021లో వచ్చిన దృశ్యం 2లో అదే రహస్యాలు మళ్లీ అతని జీవితాన్ని వెంటాడాయి. ఇప్పుడు దృశ్యం 3 లో ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. కానీ దర్శకుడు జీతు జోసెఫ్ మాత్రం ఇది జార్జ్‌కుట్టి ప్రయాణానికి అత్యంత సహజమైన కొనసాగింపే అవుతుందని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఫ్రాంచైజీ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, చైనీస్ భాషల్లో రీమేక్ అవ్వడంతో పాటు స్పానిష్​, కొరియన్​ భాషలలో కూడా అలరించడంతో, దృశ్యం 3 పై ప్రపంచ స్థాయి అంచనాలు పెరిగాయి.  2024లోనే  దృశ్యం సిరీస్​ నిర్మాతలైన ఆశీర్వాద్​ సినిమాస్​ నుండి దీని ఇంగ్లీష్​ రీమేక్​ హక్కులు పనోరమా స్టుడియోస్​, గల్ఫ్​స్ట్రీమ్​ పిక్చర్స్​, జోట్​ ఫిల్మ్స్​ దక్కించుకున్న విషయం విదితమే.