Homebound Selected In Oscars 2026 | అస్కార్ రేసులో భారత్ నుంచి ‘హోమ్ బౌండ్’ నామినేషన్

భారత్ నుంచి ఆస్కార్ 2026 కోసం 'హోమ్ బౌండ్' సినిమాకు అధికారిక ఎంట్రీ, జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటనలో.

homebound-selected-as-indias-official-entry-for-2026-oscars

విధాత, హైదరాబాద్: ఆస్కార్ అవార్డు(2026) నామినేషన్స్ కు భారత్ నుంచి హిందీ సినిమా ‘హోమ్ బౌండ్’కు అధికారికి ఎంట్రీ దక్కింది. 98వ అకాడమీ అవార్డ్స్ – 2026 కోసం భారత్‌ తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ‘హోమ్ బౌండ్’ సినిమాను అధికారికంగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సెలక్షన్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఎన్‌. చంద్ర వెల్లడించారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీకి మొత్తం 24 సినిమాలు పోటీ పడ్డాయని, అవన్నీ మనసులను తాకే సినిమాలేనని తెలిపారు. వాటిల్లో ‘హోమ్‌ బౌండ్‌’ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ ‘నాటు నాటు…’కు ఆస్కార్ అవార్డు దక్కడం తెలిసిందే. ఈ రేసులో మన దేశం నుంచి తదుపరి అస్కార్ విజేత ఎవరు అందుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. వివిధ దేశాల నుంచి వచ్చిన నామినేషన్స్ పరిశీలించిన సభ్యులు… చివరకు ఐదు సినిమాలను మాత్రమే నామినేట్ చేస్తారు. తుది జాబితాలో భారతీయ సినిమాలకు చోటు దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

24 సినిమాల్లో ఐదు తెలుగు సినిమాలు

భారత్ నుంచి ఆస్కార్ అవార్డు ఎంట్రీ కోసం పరిశీలించిన 24 చిత్రాల్లో తెలుగు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కుబేర సినిమాలు ఉండటం విశేషం. ‘ హోమ్ బౌండ్’ తో పాటు హిందీ నుంచి ఐ వాంట్ టూ టాక్, తన్వీ ది గ్రేట్, ది బెంగాల్ ఫైల్స్, హౌమ్ బౌండ్, కేసరి 2, సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్, హ్యుమన్స్ ఇన్ ద లూప్, జగ్నుమా, ఫూలే, పైర్ మూవీస్ ఉన్నాయి. అలానే మరాఠీ నుంచి 6 సినిమాలు.. సాంబర్ బోండా, స్థల్, దశావతార్, వనవాస్, పానీ,అటా తంబైచా నాయ్‌ సినిమాలు పోటీ పడ్డాయి. కన్నడ నుంచి వీర చంద్రహాస, మణిపురి నుంచి బూంగ్, మూకీ సినిమా “మెటా ది డాజ్లింగ్ గర్ల్” కూడా ఆస్కార్ ఎంట్రీకి పోటీ పడ్డాయి.

హోమ్ బౌండ్ ఎందుకు ఎంపికయ్యింది?

భారత్ నుంచి ఆస్కార్ అవార్డు ఎంట్రీకి ఎంపికైన ‘ హోమ్ బౌండ్’ సినిమాలో జాన్వీ కపూర్, యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా నటించారు. నీరజ్ ఘేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. సెప్టెంబర్ 26న సినిమాను ఇండియాలో ఈ సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గత ఏడాది ప్రదర్శితమైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చప్పట్లతో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. హోమ్ బౌండ్ స్టోరీ విషయానికి వస్తే… నార్త్ ఇండియాలో ఓ చిన్న గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పోలీసులు కావాలని కలలు కంటారు. బాల్యం నుంచి కుల వివక్ష ఎదుర్కోవడంతో పోలీసులు అయితే సమాజంలో ప్రతి ఒక్కరి నుంచి గౌరవం దక్కుతుందని భావిస్తారు. పోలీస్ కావాలని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో వాళ్లిద్దరూ ఎటువంటి ప్రయాణం చేశారు? ఆ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేది సినిమా.