Vishwambhara | విశ్వంభర మౌనం – వ్యూహమా? వాయిదా వెనుక వ్యధల దాగుడుమూతలేనా?

 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా గురించి ఆయన నోరువిప్పకపోవడం అభిమానుల్లో సందేహాలు, ఊహాగానాలకు దారితీస్తోంది. గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. భారీ బడ్జెట్‌తో, పురాణ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆశలు పెరిగినప్పటికీ, ప్రమోషన్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

Vishwambhara |  విశ్వంభర మౌనం – వ్యూహమా? వాయిదా వెనుక వ్యధల దాగుడుమూతలేనా?
  • మెగాస్టార్​ నిశ్శబ్దం దేనికి సంకేతం?
  • అంతా బాగానేఉందనుకుంటే ఏందుకీ మౌనం?
  • అభిమానుల్లో తీవ్ర నిరాశానిస్పృహలు

తెలుగు చిత్రపరిశ్రమలో ‘విశ్వంభర’ అనే పేరు వినగానే ఒక రకమైన అద్భుత ఊహాజనిత పౌరాణిక ప్రపంచం దృష్టికి వస్తోంది. బింబిసార వంటి విభిన్న సినిమాతో తన ప్రతిభను రుజువు చేసుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ట, ఈసారి మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలిపారు. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం పౌరాణిక–సాంఘిక దృశ్యకావ్యంగా ఉండబోతోందని వార్తలున్నాయి. అయితే, చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక అప్‌డేట్‌లు లేకపోవడం, ముఖ్యంగా చిరంజీవి తరపున ఎలాంటి ప్రచారం జరగకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

వాస్తవానికి, ‘విశ్వంభర’ అనేది చిరంజీవి కొత్త ఆలోచనలకు ప్రతీకగా భావించబడుతున్న చిత్రం. ‘అంజి’ తర్వాత మళ్లీ గ్రాఫిక్స్​ నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో, అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే అపారంగా ఉన్నాయి. అయితే, గతంలో విడుదల చేసిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం, ముఖ్యంగా గ్రాఫిక్స్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడం చిత్రబృందాన్ని పునఃపరిశీలనలోకి నెట్టింది.

దీంతో సినిమా గ్రాఫిక్స్‌ను  కల్కి దర్శకుడు నాగ్​అశ్విన్ సూచనలు, పర్యవేక్షణ మధ్య ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అప్పగించి, దాదాపు 1500కి పైగా CG షాట్లను అద్భుతంగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పనులన్నీ తుది దశకు చేరుకుంటున్న సమయంలో, మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడుతున్నా, ఆయన స్వయంగా ఎక్కడా ఈ సినిమా గురించి మాట్లాడకపోవడం మరింత సందేహానికి తావిస్తోంది.

ఇది వ్యూహాత్మక మౌనమా? అంటే – సినిమా ప్రమోషన్‌కు చివరి దశలో ఊపందించి ప్రేక్షకులపై దూకుడుగా ప్రభావం చూపే ప్రయత్నమా? లేక సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదనే సందేహాలను నివారించేందుకా? ఇక్కడే సమస్య.

ప్రస్తుతం పవన్​కళ్యాణ్​ ‘హరిహర వీరమల్లు’, బాలకృష్ణ ‘అఖండ 2’ వంటి పలు భారీ సినిమాలు అదే సమయంలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ‘విశ్వంభర’నూ అదే వరసలో నిలబెట్టాలంటే, ఇప్పటి నుంచే మార్కెటింగ్ ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీజర్లు, ఫస్ట్ లుక్, పాటలు వంటి ప్రచార సాధనాల ద్వారా సినిమాపై తిరిగి ఆసక్తిని రేకెత్తించాలి. చిరంజీవి స్వయంగా ముందుకొచ్చి మాట్లాడితే, ఆ విశ్వసనీయత సినిమాకు ఊపునిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే – ‘విశ్వంభర’ అనే సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న స్తబ్దతను ముందుగా చిత్రబృందమే చెరిపివేయాలి. అదే సమయంలో చిరంజీవి మౌనం ఒక వ్యూహమైతే, దానికి వెంటనే ఒక సంభ్రమాన్ని జోడించాలి. అది జరగకపోతే, ఇప్పటివరకు పడిన శ్రమ వృథా కాకముందే ఈ నిశ్శబ్దాన్ని గొప్ప ప్రమోషన్‌గా మలచాల్సిన సమయం ఇది.