Deepika replacement in Kalki 2 | ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టి దాదాపు రూ.1100 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. అలాంటి చిత్రానికి సీక్వెల్‌పై సహజంగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటిభాగంలో ముఖ్యపాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ రెండో భాగంలో కనిపించరని ప్రకటించడంతో ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి. రెండో భాగంలో ‘సుమతి’ ఎవరు అనే సందేహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దీపిక స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్, చర్చలు, ఓటింగులు విపరీతంగా జరుగుతున్నాయి.
అభిమానులు ఎక్కువగా సూచిస్తున్న పేరు అనుష్క శెట్టి. బాహుబలి సినిమాల్లో ప్రభాస్‌తో ఆమె కెమిస్ట్రీ మళ్లీ సీక్వెల్‌లో పునరావృతం అయితే అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని వారు అంటున్నారు. కొందరు బాహుబలిలో అనుష్క గర్భిణీ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ, కల్కిలో గర్భిణిగా ఆమె సహజంగానే జీవిస్తుందని వాదిస్తున్నారు. పైగా అనుష్కను ప్రభాస్ అభిమానులు వదినగా అభిమానిస్తారు.
అంతేకాకుండా, కొందరు యువ నటీమణులపైనా దృష్టి సారించారు. ఇటీవల “కొత్త లోక” మూవీలో యోధురాలిగా ఆకట్టుకున్న కల్యాణి ప్రియదర్శన్ను చాలా మంది ఫ్యాన్స్ దీపిక స్థానంలో తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సెటప్‌లో ఆమె బలమైన పాత్రను అవలీలగా ధరించగలదని అభిప్రాయం. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ కూడా మంచి ఆప్షన్ అని మరికొందరి సలహా. ఇంకా కొంతమంది బాలీవుడ్ నాయికల వైపు మొగ్గుతున్నారు. దీపిక స్థానంలో అలియా భట్, కియారా అద్వానీ, కత్రినా కైఫ్‌లాంటి స్టార్ హీరోయిన్లను తీసుకుంటే ‘కల్కి 2’ కి మరింత పాన్-ఇండియా, గ్లోబల్ మార్కెట్‌లో రీచ్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎవరిని హీరోయిన్‌గా తీసుకున్నా, అది ఆశ్చర్యకరంగా ఉండాలని, నాగ్ అశ్విన్ ఎప్పటిలాగే విభిన్నమైన ఎంపిక చేస్తారని అభిమానులు నమ్ముతున్నారు. దర్శకుడు ఇప్పటికే మొదటిభాగంలో హాలీవుడ్ రేంజ్ మేకింగ్ చూపించినందున సీక్వెల్‌లో కూడా మరిన్ని నూతన ప్రయోగాలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.
దీపికను తప్పించడంపై పనిగంటలు, పారితోషికం, ఇతర డిమాండ్ల వంటి కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై నిర్మాతలు లేదా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. నాగ్ అశ్విన్ మాత్రం “జరిగిన దాన్ని మార్చలేం, కానీ తర్వాత ఏమి జరగాలో మనమే నిర్ణయించుకోవాలి” అని సోషల్ మీడియాలో స్పందించడం గమనార్హం.
ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, నాగ్ అశ్విన్ కూడా కొత్త స్క్రిప్ట్స్‌పై వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘కల్కి 2’ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, కొత్త హీరోయిన్ ఎంపికపై వైజయంతీ మూవీస్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి, దీపిక స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. అనుష్కా? కల్యాణా? కీర్తి సురేశా? లేక మరో స్టార్ హీరోయిన్ ఎవరైనానా? అన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లో లభించే అవకాశం ఉంది.