Pawan Kalyan | చిరంజీవి ఇంట్లో పవన్ కల్యాణ్ సంబరాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ గురువారం హైదరాబాద్‌లోని తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం, అభినందనలు అందుకున్నారు.

Pawan Kalyan | చిరంజీవి ఇంట్లో పవన్ కల్యాణ్ సంబరాలు

టపాసులు..స్వీట్లతో అభిమానుల సందడి
అమ్మ…అన్నా వదినలకు పవన్ పాదాభివందనం

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ గురువారం హైదరాబాద్‌లోని తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం, అభినందనలు అందుకున్నారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా మెగా అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణి చేసి, పూల వర్షం కురిపించి సందడి చేశారు. చిరంజీవి ఇంటికి చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ ఉన్న తన తల్లితో పాటు అన్న చిరంజీవి దంపతులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు. తర్వాత చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. కుటుంబ సభ్యులందరూ పవన్ కల్యాణ్‌తో భారీ కేక్ కటింగ్ చేయించారు. తమ్ముడు పవన్ సాధించిన విజయం పట్ల చిరంజీవి ఆనందంతో ఉప్పొంగారు.

ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులు రామ్ చరణ్, రామ్ చరణ్, భార్య ఉపాసన, చిరంజీవి కుమార్తెలు, మనవరాళ్ళు, మనవళ్లు, వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య, నిహారిక సహా అందరూ పాల్గొన్నారు. పవన్ వెంట తన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అఖీరా నందన్ కూడా ఉన్నారు. పవన్ దంపతులకు చిరు సతీమణి సురేఖ మంగళహారతితో స్వాగతం పలికారు.

చిరంజీవి ఇంటి వద్ధ పవన్ కల్యాణ్ విజయోత్సవ సంబరాల వీడియో రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా కుటుంబ సభ్యుల పవన్ విజయోత్సవ సంబరాల్లో పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ లేకపోవడం అభిమానులను కొంత నిరుత్సాహపరిచింది.

పడిలేచిన ప్రస్థానాన్ని తలుచుకుని

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పడిలేచిన ప్రస్థానాన్ని ఈ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాతా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలం పిదప పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు.

2014లోనే పార్టీ స్థాపించినప్పటికి అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం,బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకే పరిమితమయ్యారు. తను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఓడిపోయి అవమానం పాలయ్యారు. ఆ తర్వాతా వైసీపీ మాజీ సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం సాగించారు.

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంలో జైలుకెళ్లి పరామర్శించి అక్కడే పొత్తును ప్రకటించారు. బీజేపీ ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలను ఆసరగా చేసుకుని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యహరించడంతో పాటు తాను తొలిసారిగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ విజయం సాధించారు.

జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తనతో పాటు పోటీ చేసిన మొత్తం 21స్థానాల్లో, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుని సంచలన విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యుల్లో పవన్ కీలకంగా నిలిచారు.